గాయం కారణంగా గతేడాది ఐపీఎల్‌కు దూరమైన దిల్లీ క్యాపిటల్స్ స్పిన్నర్ అమిత్ మిశ్రా ఈసారి తన స్పిన్ ఉచ్చును ప్రయోగించేందుకు సిద్ధమయ్యాడు. టీమ్‌ఇండియాలో మంచి ప్రదర్శన చేస్తున్న సమయంలోనే తుది జట్టులో చోటు కోల్పోయిన అతడు.. ఐపీఎల్‌లో ఇంకా కొనసాగుతున్నాడు. అయితే, తన విషయంలో ఇతరులు ఏమనుకుంటున్నా పట్టించుకోనని, ఆటపై ఇంకా ఇష్టం ఉండటం వల్లే ఆడుతున్నానని చెప్పాడు.
'నా గురించి ఇతరులు అనుకుంటున్న వాటిని నేను ఆపలేను. అయితే, నా శక్తి సామర్థ్యాలకు నిదర్శనం ఏమిటంటే.. ప్రపంచంలోనే అత్యంత పోటీగల టీ20 లీగ్‌లో 13 ఏళ్లుగా ఆడుతున్నా. అదే ఒక ఘనత. ఈ లీగ్‌లో నేను ఎక్కువ వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా కొనసాగుతున్నా. ఇంతకు మించి ఏం చేయాలి? అతిగొప్ప లీగ్‌లో అత్యుత్తమ ఆటగాడిగా ఉన్నా. నా పని వికెట్లు తీయడమే. ఎన్నో ఏళ్లుగా అదే చేస్తున్నా. ఇప్పుడు నా గురించి ఎవరేమనుకున్నా పట్టించుకోను. వాళ్ల మాటలతో ఏ ప్రయోజనం ఉండదు. క్రికెట్ అంటే నాకు చాలా ఇష్టం అందుకే ఆడుతున్నా. వచ్చే ఏడాది నా శరీరం సహకరిస్తే దేశవాళీ క్రికెట్ ఆడతా' అని మిశ్రా చెప్పుకొచ్చాడు.