పరస్పర విరుద్ధ ప్రయోజనాల నిబంధనలు ఉల్లఘిస్తున్నాడంటూ తనపై చేస్తున్న విమర్శకులకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తనదైన శైలిలో బదులిచ్చాడు. బీసీసీఐ అధ్యక్షుడి హోదాలో ఉన్నా సీనియర్ ఆటగాడిగా యువ క్రికెటర్లకు సలహా ఇస్తానని తెలిపాడు. దిల్లీ సారథి శ్రేయస్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలతో దాదాపై పరస్పర విరుద్ధ ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో గంగూలీ స్పష్టత ఇచ్చాడు.
"గతేడాది శ్రేయస్ అయ్యర్‌కు సాయం చేశాను. ప్రస్తుతం నేను బీసీసీఐ అధ్యక్షుడిని కావొచ్చు. కానీ భారత్ తరఫున దాదాపు 500 అంతర్జాతీయ మ్యాచ్‌ల ఆడాను. ఆ విషయాన్ని మీరు మర్చిపోవద్దు. సీనియర్ ఆటగాడిగా యువ క్రికెటర్లకు సహాయం చేస్తా. అది శ్రేయస్ అయ్యర్ కావొచ్చు లేదా విరాట్ కోహ్లీ అవ్వొచ్చు. వారికి నా సలహాలు కావాలంటే కచ్చితంగా ఇస్తాను."
- సౌరవ్ గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు
పంజాబ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌కు ముందు శ్రేయస్ అయ్యర్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. తాను మంచి ఆటగాడిగా, కెప్టెన్‌గా మెరుగవ్వడానికి పాంటింగ్, గంగూలీ పాత్ర ఎంతో ఉందని కొనియాడాడు. దీంతో ఈ సీజన్‌లో దిల్లీ జట్టుకు దాదా మెంటార్‌గా వ్యవహరిస్తున్నాడని ఆరోపణలు వచ్చాయి. బీసీసీఐ అధ్యక్షుడి హోదాలో ఉన్న గంగూలీ పరస్పర విరుద్ధ ప్రయోజన నిబంధనలు ఉల్లఘిస్తున్నాడని ఆరోపించారు.
అయితే దాదా గత సీజన్‌లో దిల్లీకి మెంటార్‌గా వ్యవహరించాడు. అధ్యక్షుడి పదవి చేపట్టిన తర్వాత ఆ పదవికి రాజీనామా చేశాడు. కానీ ఈ సీజన్‌లోనూ దాదా దిల్లీ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడని విమర్శకులు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. దీనికి శ్రేయస్ అయ్యర్ స్పందించాడు. 'గత సీజన్‌లో దాదా, రికీ అండగా నిలిచార'ని స్పష్టత ఇస్తూ ట్వీట్ చేశాడు.