టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య కొంతకాలంగా గాయంతో బాధపడుతున్నాడు. అయితే వెన్నుగాయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నట్లు తెలుస్తోంది. దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్‌కు ఇతడు ఎంపికయ్యే అవకాశం ఉందని సమాచారం. ఇటీవల లండన్‌లో సాధారణ చెకప్ చేయించుకున్న పాండ్య ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు.
"లండన్ నుంచి పాండ్య తిరిగొచ్చాడు. ఇది రెగ్యులర్ చెకప్ మాత్రమే. ఈ వారం నుంచి అతడు బౌలింగ్ సాధన చేస్తున్నాడు. త్వరలోనే టీమిండియాకు ఎంపికవ్వొచ్చు. వీలైతే దక్షిణాఫ్రికా సిరీస్‌లో అతడిని చూడొచ్చు"
-ఎన్‌సీఏ సభ్యుడు
ఎన్‌సీఏలో చేరకముందు పాండ్య, బుమ్రా.. దిల్లీ క్యాపిటల్స్ ట్రైనర్ రజినీకాంత్ శివగ్నమమ్ వద్ద పునరావాసం పొందారు. ఈ విషయమై బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరభ్ గంగూలీ ఇటీవల మాట్లాడుతూ ఎవరైనా ఆటగాడు గాయపడితే ఎన్‌సీఏకి రావాలని, అక్కడే తమకు కావాల్సిన సేవలను ఉపయోగించుకోవాలని చెప్పారు. ఫలితంగా పాండ్య ప్రస్తుతం ఎన్‌సీఏలో తన సామర్థ్యాన్ని పెంచుకుంటున్నాడు.