వెన్ను గాయంతో స్టార్ బౌలర్ జస్ప్రీస్ బుమ్రా జట్టుకు దూరమైన విషయం మరువకముందే కోహ్లీసేనకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు దూరం కానున్నాడు. అతడి వెన్నుపూస కింది భాగంలో గాయం మళ్లీ తిరగబెట్టిందని సమాచారం. గతేడాది సెప్టెంబర్‌లో దుబాయ్‌లో ఆసియాకప్ ఆడుతుండగా హార్దిక్ వెన్ను గాయంతో బాధపడ్డాడు.
"ఆసియా కప్‌లో గాయపడ్డప్పుడు బ్రిటన్‌లో చికిత్స అందించిన వైద్యుడి వద్దకే హార్దిక్‌ను పంపించే అవకాశాలున్నాయి. అందుకే బంగ్లాదేశ్ సిరీస్ ఆడకపోవచ్చు. అతడు ఎంత కాలం దూరంగా ఉంటాడో స్పష్టత లేదు. బ్రిటన్ నుంచి తిరిగొచ్చిన తర్వాతే పూర్తి వివరాలు తెలుస్తాయి" - బీసీసీఐ అధికారి.
తిరగబెట్టిన గాయం వల్ల హార్దిక్‌కు శస్త్రచికిత్స జరిగే అవకాశముందని, ఒకవేళ అదే జరిగితే అతడు కనీసం ఐదు నెలలు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని బీసీసీఐ అధికారి తెలిపాడు. శస్త్రచికిత్స లేకుండానే అతడు తిరిగిరావాలని, లేకపోతే 2020 ఐపీఎల్ వరకు అందుబాటులో ఉండడని చెప్పాడు.
ఇదీచదవండి: సింధు చేతుల మీదుగా 'యువ దసరా క్రీడలు'