శనివారం టీమిండియాతో జరిగిన రెండో వన్డేలో గెలిచిన న్యూజిలాండ్, 2-0 తేడాతో సిరీస్ సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత కివీస్.. 273 పరుగుల చేయగా, ఛేదనలో భారత్.. 251 పరుగులకే ఆలౌటైంది. శ్రేయస్ అయ్యర్ మినహా(52), జడేజా(55), సైనీ(45) మినహా మిగతా అందరూ విఫలం కావడం.. కోహ్లీసేన ఓటమికి కారణమైంది. ఎవరూ ఊహించని విధంగా బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న సైనీ.. తాను చివరి వరకు క్రీజులో నిలిచి ఉంటే ఫలితం వేరేలా ఉండేదని అన్నాడు.
"జడేజాతో పాటు నేను చివరి వరకు ఉంటే ఫలితం మరోలా ఉండేది. వికెట్ ఫ్లాట్‌గా ఉండటం వల్ల బంతి నేరుగా బ్యాట్‌పైకి వస్తుంది. 113 బంతుల్లో 121 పరుగులు కొట్టాల్సిన సందర్భంలో చేతిలో మూడు వికెట్లే ఉన్నాయి. అప్పుడు ఇద్దరం కలిసి 76 పరుగులు చేశాం. నేను బ్యాటింగ్ చేయగలనని ఎవరూ అనుకొని ఉండరు. టీమిండియా త్రోడౌన్ స్పెషలిస్టు రఘు నాలోని బ్యాటింగ్ స్కిల్స్‌ను గుర్తించాడు. ఆయన మాటలు నాలో స్ఫూర్తి నింపాయి. హోటళ్ల రూమ్‌లోనూ ఈ విషయం గురించే మాట్లాడేవారు. అదే ఇలా బ్యాటింగ్ చేయడానికి కారణమైంది. నేను బంతిని ఫోర్ కొట్టిన తర్వాత కాస్త ఆశ్చర్యానికి లోనయ్యా. బ్యాట్‌పైకి బంతి బాగా రావడం వల్ల సులువుగా షాట్లు ఆడా. కాకపోతే నేను ఔట్ కావడం చాలా బాధ కలిగించింది. అలా జరగకుంటే ఉండుంటే మ్యాచ్ ఫలితం వేరేలా ఉండేది" -నవదీప్ సైనీ, భారత బౌలర్
భారత్-న్యూజిలాండ్ మధ్య నామమాత్ర మూడో వన్డే ఈ మంగళవారం జరగనుంది. ఇందులో గెలిచి సిరీస్ క్లీన్‌స్వీప్ చేయాలని కివీస్ చూస్తుండగా, పరువు నిలబెట్టుకోవాలని కోహ్లీసేన భావిస్తోంది. దీని తర్వాత రెండు టెస్టుల సిరీస్ జరగనుంది. ఇప్పటికే 5-0 తేడాతో టీ20 సిరీస్‌ను భారత్ గెల్చుకుంది.