భారత మహిళల జట్టుకు వన్డే ప్రపంచకప్ అందించాలన్నది దిగ్గజ క్రికెటర్ మిథాలీ రాజ్ కల. 2002లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన మిథాలీ.. 2005 నుంచి ప్రయత్నిస్తున్నప్పటికీ.. తన ప్రపంచకప్ కల నెరవేరలేదు. ఆమె నాయకత్వంలో రెండుసార్లు ఫైనల్ చేరిన భారత్.. కప్పు మాత్రం అందుకోలేకపోయింది. వచ్చే ఏడాది జరగబోయే వన్డే ప్రపంచకప్‌లో జట్టును గెలిపించేందుకు చివరగా మరో ప్రయత్నం చేస్తానని మిథాలీ అంటోంది.
"2013 ప్రపంచకప్ భారత్‌లోనే జరిగింది. కానీ మేం సూపర్ సిక్స్ దశకు కూడా అర్హత సాధించలేకపోయాం. 2017లో చివరగా ఓ ప్రయత్నం చేద్దామనుకున్నా. ఇందుకోసం ఎంతో శ్రమించా. కెప్టెన్‌గా, వ్యక్తిగతంగా ఎంతగానో సన్నద్ధమయ్యా. జట్టు ఫైనల్ చేరగానే ఆ మ్యాచ్‌లో గెలిస్తే రిటైరవుదామనుకున్నా. ఇన్నేళ్లు ఆటలో కొనసాగాక అన్నీ సాధించినా, ప్రపంచకప్ మాత్రం కలగానే మిగిలిపోయింది. వచ్చే ఏడాది మరో ప్రయత్నం చేయాలనుకుంటున్నా. అందరి ఆకాంక్షలు, దేవుడి దయ ఉంటే ఈసారైనా కప్పు అందుకుంటానేమో చూడాలి."
-మిథాలీ రాజ్, మహిళా టీమ్ఇండియా కెప్టెన్
వన్డేల మీదే దృష్టిపెట్టేందుకు మిథాలీ గతేడాది టీ20లకు గుడ్‌బై చెప్పేసింది. చిన్నపుడు సివిల్ సర్వీస్‌లో చేరాలనుకున్న తను.. క్రికెట్‌నే జీవితంగా మార్చుకుంటానని ఊహించలేదని తెలిపింది. "క్రికెట్లోకి నా ఇష్టంతో నేను రాలేదు. మా నాన్న నన్ను తీసుకెళ్లి అకాడమీలో చేర్చారు. తర్వాత నేను పూర్తి స్థాయిలో క్రికెట్ కెరీర్‌ను ఎంచుకున్నా. అప్పటికి నాకు పదేళ్లే. ఏం కావాలనుకుంటున్నావని అడిగితే ఐఏఎస్ అధికారి అనేదాన్ని" అని మిథాలీ వెల్లడించింది.