నాన్ స్ట్రైకర్స్ ఎండ్‌లో క్రీజును వదిలి ముందుకెళ్లే బ్యాట్స్‌మన్‌ను బౌలర్ రనౌట్ చేయడాన్ని 'మన్కడ్' పేరుతో పిలుస్తుండడంపై భారత మాజీ కెప్టెన్, వ్యాఖ్యాత సునీల్ గావస్కర్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. అలా రనౌట్ చేయడంలో తప్పు లేదని చెప్పిన అతడు.. దాన్ని మన్కడింగ్ అని కాకుండా బ్రౌన్ అని పిలవాలని అన్నాడు. దిల్లీ-బెంగళూరు మ్యాచ్‌లో ఫించ్‌ను రనౌట్ చేసే అవకాశమున్నా సరే అశ్విన్ వదిలేశాడు. ఈ నేపథ్యంలోనే గావస్కర్ పై వ్యాఖ్యలు చేశాడు.
"ఫించ్ అలా వెళ్తున్నప్పుడు ఆస్ట్రేలియా ఇంకెప్పుడు నేర్చుకుంటుంది అనిపించింది. 1947లో బిల్ బ్రౌన్ ఇలాగే ఔటయ్యాడు. ఇప్పుడు మనం 2020లో ఉన్నాం. నాన్‌స్ట్రైకర్.. బౌలర్‌ను చూడాలి. అతడు బంతి వదిలిన తర్వాత క్రీజు నుంచి కదలాలి. నిబంధనలు స్పష్టంగా ఉన్నాయి" అని గావస్కర్ అన్నాడు.
"వినూ మన్కడ్ భారత క్రికెట్ దిగ్గజం. ప్రపంచమంతా క్రీడాస్ఫూర్తికి విరుద్ధమైన ప్రవర్తనగా భావించే సందర్భానికి అతడి పేరును వాడడం ఆమోదయోగ్యం కాదు. 1947లో తప్పు బ్రౌన్‌ది, మన్కడ్‌ది కాదు" అని గావస్కర్ చెప్పాడు.
1947లో సిడ్నీ టెస్టులో మన్కడ్.. బిల్ బ్రౌన్‌ను రనౌట్ చేయడం వల్ల 'మన్కడింగ్' అని పిలవడం మొదలైంది.