ఆటకు వీడ్కోలు పలికిన షేన్ వాట్సన్, వయసు మీద పడుతున్న డ్వేన్ బ్రావో స్థానాలను భర్తీచేయగల ఆటగాళ్లను చెన్నై సూపర్‌కింగ్స్ కొనుగోలు చేయాల్సి ఉందని టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ అన్నాడు. ప్రస్తుతం జరిగే వేలం చిన్నదే కాబట్టి ఎక్కువ మందిని తీసుకోకూడదని సూచించాడు. సురేశ్ రైనా రావడం వల్ల జట్టు మళ్లీ బలంగా మారిందని వెల్లడించాడు. గురువారం ఐపీఎల్ వేలం జరగనున్న నేపథ్యంలో సీఎస్కేకు గంభీర్ సూచనలు ఇచ్చాడు.
"ముందుగా షేన్ వాట్సన్ స్థానాన్ని భర్తీ చేసుకోవాలి. గతేడాది సురేశ్ రైనా లేడు. ఈసారి అందుబాటులో ఉంటాడు. చెపాక్ మందకొడి పిచ్. బంతి ఎక్కువగా టర్న్ అవుతుంది. అందుకే మహీ ఇక్కడ సుదీర్ఘంగా ఆడగలుగుతున్నాడు. హర్భజన్‌ను విడుదల చేయడం వల్ల ఈసారి ఒక ఆఫ్ స్పిన్నర్‌ను తీసుకోవచ్చు. అలాగే ఒక ఆల్‌రౌండర్‌ను ఎంపిక చేసుకోవచ్చు. సాధారణంగా చెన్నైకి ఇద్దరు విదేశీ ఆటగాళ్లు ఓపెనింగ్ చేస్తారు కాబట్టి మరో బ్యాటర్‌ను తీసుకోవచ్చు. అయితే మరీ ఎక్కువ మార్పులైతే ఉండవు."
- గౌతమ్ గంభీర్, టీమ్ఇండియా మాజీ క్రికెటర్
ఈ సీజన్లో వేలం చిన్నదే కాబట్టి జట్టును తక్కువ మందికే పరిమితం చేయాలని గంభీర్ సూచించాడు. "ఈ సీజన్ తర్వాత భారీ వేలం జరుగుతుంది. అందుకే చెన్నైలో సమూల మార్పులు ఉంటాయని అనుకోను. ఈసారి సురేశ్ రైనా రావడం ఆ జట్టుకు భారీ ఊరట. ఎందుకంటే అతడు టీ20 క్రికెట్ బాగా ఆడతాడు. చెన్నైకి ఎన్నో విజయాలు అందించాడు. అదే సమయంలో వారికి కొత్త ఆటగాళ్లూ వస్తారు. కొత్తవాళ్లు వచ్చినప్పుడు కొత్త ఆలోచనలు, కొత్త బలం తెస్తారు. వీటి కోసమే ఆ జట్టు చూస్తుందని అనుకుంటున్నా" అని గంభీర్ అన్నాడు.
ఇదీ చూడండి: రెండో టెస్టులో టీమ్ఇండియా అశ్వశక్తి!