2003 నాట్వెస్ట్ ట్రోఫీ ఫైనల్లో జరిగిన ఓ ఆసక్తికర విషయాన్ని భారత మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ చెప్పాడు. సెహ్వాగ్ వల్ల కెప్టెన్గా ముఖ్యమైన విషయాన్ని తాను తెలుసుకున్నానని అన్నాడు.
"ఫైనల్లో 325 పరుగుల లక్ష్యాన్ని మేం ఛేదించాల్సి రావడం వల్ల నేను చాలా నిరాసక్తతతో ఉన్నాను. మనం కచ్చితంగా గెలుస్తామని అప్పుడు సెహ్వాగ్ నాతో అన్నాడు. 12 ఓవర్లలో 82 పరుగులతో ఉన్నప్పుడు వికెట్లు కోల్పోకుండా సింగిల్స్ తీయాలని అతడితో చెప్పాను. ఆ తర్వాత రోనీ ఇరానీ తన తొలి ఓవర్ వేయడానికి వచ్చినప్పుడు, తొలి బంతికి సెహ్వాగ్ ఫోర్ కొట్టాడు. మనం బౌండరీ కొట్టాం సింగిల్ తీయు అని అతడితో చెప్పినప్పటికీ రెండు, మూడు, ఐదో బంతుల్లో ఫోర్లు కొట్టాడు. కెప్టెన్ అయినప్పటికీ ఆటగాళ్ల ఆలోచనలకు తగ్గట్లు మారాలని అప్పుడే నాకు అర్థమైంది" అని గంగూలీ చెప్పాడు.
ఈ ఫైనల్లో టీమ్ఇండియా 2 వికెట్ల తేడాతో గెలిచింది. కైఫ్(87), గంగూలీ(60), యువరాజ్ (69) అద్భుత ప్రదర్శన చేసి విజయంలో కీలక పాత్ర పోషించారు.