టీ20 ఫార్మాట్లో విజయవంతమైన కోచ్ అయ్యేందుకు అంతర్జాతీయ అనుభవం అవసరమేమీ లేదని టీమ్‌ఇండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ తెలిపాడు. అతడు చేయాల్సిందల్లా ఆటగాళ్లలో సానుకూల ధోరణి పెంచడమేనని పేర్కొన్నాడు. కానీ ఈ ఫార్మాట్‌కు ప్రత్యేక బ్యాటింగ్ కోచ్‌ను నియమించాల్సిన అవసరం ఉందన్నాడు.
"టీ20 క్రికెట్‌కు ప్రత్యేకమైన కోచ్ ఉంటే మంచిది. అంతర్జాతీయ క్రికెట్ అనుభవం లేని, ఎక్కువ క్రికెట్ ఆడనివారు విజయవంతమైన కోచ్ కాలేరన్నది నిజం కాదు. టీ20 క్రికెట్‌లో ఆటగాళ్ల మానసిక ధోరణి మార్చడం, సానుకూల దృక్పథం పెంచడమే కోచ్ పని. భారీ షాట్లు ఆడేలా, నిర్ణీత లక్ష్యాలు సాధించేలా ప్రేరణ అందించాలి"
-గౌతమ్ గంభీర్, టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్
టీ20 ఫార్మాట్లో షాట్లు ఎలా ఆడాలో నేర్పించడం కోచ్ పనికాదని గౌతీ స్పష్టం చేశాడు. "ల్యాప్ షాట్ లేదా రివర్స్ ల్యాప్ షాట్ ఎలా ఆడాలో ఎవ్వరూ నేర్పించరు. ఏ కోచ్ ఆ పని చేయడు. ఎవరైనా అలా చేస్తున్నారంటే అతడు ఆటగాడికి మేలు కన్నా కీడే ఎక్కువగా చేస్తున్నాడని అర్థం" అని గంభీర్ స్పష్టం చేశాడు.
విజయవంతమైన క్రికెటర్ మెరుగైన సెలక్టర్‌గా మారగలడని చెప్పాడు గంభీర్. "విజయవంతమైన కోచ్ అయ్యేందుకు ఎక్కువ అనుభవం అవసరం లేదు. సెలక్టర్ విషయంలో మాత్రం ఇది పనికొస్తుంది" అని వెల్లడించాడు.
ఇదీ చూడండి.. కొడుకుతో కలిసి స్టెప్పులేసిన ధావన్