ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో(చివరి) టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా ఆచితూచి ఆడుతోంది. ఐదో రోజు ఆటలో టీ బ్రేక్ సమయానికి మూడు వికెట్లు కోల్పోయి 183 పరుగులు చేసింది. విజయానికి 145 పరుగులు దూరంలో ఉంది. క్రీజులో పుజారా(43), పంత్(10) ఉన్నారు.
భోజన విరామం తర్వాత 132 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. సెంచరీకి చేరువవుతున్న గిల్(91)ను బోల్తా కొట్టించాడు లైయన్. ఆ తర్వాత 167 పరుగుల వద్ద రహానె (24).. కమిన్స్ బౌలింగ్‌లో మూడో వికెట్‌గా వెనుదిరిగాడు. దీంతో 63 ఓవర్లలో భారత్ 183/3గా స్కోరు నమోదు చేసింది.
పంత్ రికార్డు
ఈ క్రమంలోనే పంత్ టెస్టుల్లో వెయ్యి పరుగులు పూర్తి చేశాడు. భారత్ తరఫున అతి తక్కువ (27) ఇన్నింగ్స్‌లో ఈ ఘనత సాధించిన వికెట్‌కీపర్‌గా రికార్డు నెలకొల్పాడు. ధోనీ 32 ఇన్నింగ్స్‌లతో రెండో స్థానంలో ఉన్నాడు.