ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2008లో మొదలైంది. అప్పటి నుంచి ఎంతో మంది యువ క్రికెటర్లు వెలుగులోకి వచ్చారు. దీంతో అనతికాలంలోనే క్యాష్ రిచ్ లీగ్‌గా ఈ టోర్నీ పేరు తెచ్చుకుంది. ఇందులో ఓ సీజన్లో ఆడితేనే గొప్ప అవకాశంగా భావిస్తారు. అలాంటింది 12 సీజన్లో ఎన్నో మ్యాచ్‌లు ఆడిన స్టార్ క్రికెటర్లూ ఉన్నారు. అయితే వీళ్లెవరూ ఒక్కసారైనా తమ జట్టుకు కప్పు అందించలేకపోయారు.
విరాట్ కోహ్లీ..
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ప్రపంచ అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లో ఒకడు. అండర్-19, సీనియర్ స్థాయి సహా ఛాంపియన్స్ ట్రోఫీ ప్రపంచకప్‌లు గెలిచిన జట్టులో ఉన్నాడు. అయితే ఐపీఎల్ ట్రోఫీని మాత్రం గెలుచుకోలేకపోయాడు. మొత్తం 177 మ్యాచ్‌లు ఆడిన విరాట్.. 5412 పరుగులు చేశాడు. టోర్నీలో అత్యధిక పరుగుల చేసినవాడిగానూ కొనసాగుతున్నాడు. కానీ ఏ సీజన్లోనూ విజేతగా నిలవలేకపోయాడు.
ఏబీ డివిలియర్స్...
ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన విదేశీ ఆటగాళ్లలో మూడో స్థానంలో ఉన్నాడు డివిలియర్స్. తొలి మూడు సీజన్లు దిల్లీ డేర్‌డెవిల్స్ తరఫున ఆడాడు. అనంతరం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు మారాడు. అప్పట్నుంచి తనదైన ప్రదర్శనతో ఆకట్టుకుంటూనే ఉన్నాడు. మిస్టర్.360గా అభిమానులకు గుర్తుండిపోయాడు. 154 మ్యాచ్‌లు ఆడిన ఏబీ.. మొత్తం 4395 పరుగులు చేశాడు. ఇందులో మూడు శతకాలు ఉన్నాయి. కానీ ఇప్పటివరకు కనీసం ఒక్కసారైనా ట్రోఫీని ముద్దాడలేకపోయాడు.
క్రిస్‌గేల్
ఈ వెస్టిండీస్ విధ్వంసకర వీరుడు క్రిస్‌గేల్.. 2009లో తొలిసారి కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున ఆడాడు. 2010లోనూ అదే జట్టు తరఫున బరిలోకి దిగాడు. 2011లో రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరుకు మారాడు. ఈ టీమ్ తరఫున 66 బంతుల్లో 175 నాటౌట్ లాంటి ఎన్నో మేటి ప్రదర్శనలు చేశాడు. రెండుసార్లు జట్టు ఫైనల్ వరకు వెళ్లడంలో కృషి చేశాడు. ట్రోఫీని మాత్రం అందించలేకపోయాడు. 2018 నుంచి కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరఫున ఆడుతున్నాడు. కానీ ఆ జట్టును కనీసం ప్లేఆఫ్స్‌కు కూడా చేర్చలేకపోయాడు. మొత్తం మూడు జట్ల తరఫున 125 మ్యాచ్‌లు ఆడిన గేల్.. విజేతగా నిలవలేకపోయాడు
అజింక్య రహానె
భారత టెస్టు జట్టుకు వైస్‌కెప్టెన్‌గా ఉన్న అజింక్య రహానె.. 2008 నుంచి 2019 మధ్య మొత్తం 140 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో ముంబయి ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ సహా రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్ ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించాడు. 2017 ఐపీఎల్లో ఫైనల్‌కు వెళ్లింది పుణె. అయితే తుది పోరులో ఒక్క పరుగు తేడాతో ముంబయి చేతిలో ఓడిపోయింది. అలా జట్టుతో కలిసి ట్రోఫీని ముద్దాడే అదృష్టాన్ని కోల్పోయాడు రహానె. 32 ఏళ్ల ఈ బ్యాట్స్‌మన్.. ఐపీఎల్లో 3820 పరుగులు చేశాడు.ఈ ఏడాది దిల్లీ క్యాపిటల్స్ తరఫున బరిలోకి దిగనున్నాడు.
అమిత్ మిశ్రా
దిల్లీ డేర్‌డెవిల్స్ తరఫున అరంగేట్రం చేసిన అమిత్ మిశ్రా.. 2011లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మారాడు. 2014 వరకు ఇదే జట్టుతో కొనసాగాడు. మళ్లీ దిల్లీ జట్టుకే మారిపోయాడు. మొత్తంగా 147 మ్యాచ్‌లు ఆడి, 157 వికెట్లు తీసిన ఈ బౌలర్.. 12 సీజన్లలో కలిపి అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా కొనసాగుతున్నాడు. మలింగ తొలి స్థానంలో ఉన్నాడు. ఈ దిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు మూడుసార్లు హ్యాట్రిక్ తీశాడు. ఒక్కసారైనా తను ఆడిన జట్టుకు ట్రోఫీ అందించలేకపోయాడు.
ఈ ఏడాది ఐపీఎల్.. సెప్టెంబర్ 19న ప్రారంభమై, నవంబర్ 8న ముగియనుంది. యూఏఈలోని షార్జా, దుబాయ్, అబుదాబి వేదికల్లో మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ విషయాన్ని ఐపీఎల్ ఛైర్మన్ బ్రిజేశ్ పటేల్ వెల్లడించారు.