ఈ ఏడాదికి ఐపీఎల్ స్పాన్సర్‌షిప్ నుంచి తప్పుకున్న 'వివో' స్థానంలోకి వచ్చేందుకు టాటా మోటార్స్, డ్రీమ్ ఎలెవన్, అన్‌అకాడమీ సంస్థలు ఆసక్తి చూపించాయి. ఇవి మూడూ ఐపీఎల్-13 టైటిల్ స్పాన్సర్‌షిప్ కోసం శుక్రవారం బిడ్‌లు వేశాయి. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారి ఒకరు ధ్రువీకరించారు. ఈ బిడ్‌లు దాఖలు చేయడానికి శుక్రవారమే ఆఖరి రోజు. వీటితో పాటు ఐపీఎల్-13 టైటిల్ స్పాన్సర్‌షిప్ కోసం రేసులో జియో, బైజూస్ సంస్థలు కూడా ఉన్నాయని సమాచారం.
ఈ నెల 18న స్పాన్సర్‌షిప్ బిడ్‌లు తెరుస్తారు. దేశంలో కొన్ని నెలలుగా చైనా వ్యతిరేక ఉద్యమం నడుస్తున్న నేపథ్యంలో ఆ దేశానికి చెందిన వివో ఈ ఏడాదికి ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌షిప్ నుంచి తప్పుకుంది. ఆ సంస్థ ఏటా బీసీసీఐకి రూ.440 కోట్లు చెల్లిస్తోంది. ఈ ఏడాది వరకు వేరుగా ఒప్పందం కోసం ప్రయత్నిస్తున్న బోర్డు.. టైటిల్ స్పాన్సర్‌షిప్ ఒప్పందం ద్వారా రూ.300 కోట్ల మేర అయినా వస్తాయని ఆశిస్తోంది.
ఈ ఏడాది ఐపీఎల్ వేరే దేశంలో జరుగుతున్నప్పటికీ.. భారత్‌లో టోర్నీ జరిగే రోజులతో పోలిస్తే అవినీతికి అవకాశం లేకుండా చూడటం సులువే అని బీసీసీఐ అవినీతి నిరోధకం విభాగం అధినేత అజిత్ సింగ్ అభిప్రాయపడ్డారు. "ఇదే అత్యంత సురక్షితమైన టోర్నీ అని చెప్పలేను. కానీ బయో సెక్యూర్ నిబంధనల వల్ల జట్లు, సహాయ సిబ్బందితో బయటి వ్యక్తులు చర్చలు జరిపే అవకాశం లేదు కాబట్టి పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. అయినా సరే పూర్తిగా దాన్ని నివారించేసినట్లు కాదు. కానీ నేరుగా ఆటగాళ్లను కలవలేకపోయినా, మాట్లాడలేకపోయినా, సామాజిక మాధ్యమాల ద్వారా వారిని ప్రలోభ పెట్టేందుకు అవకాశముంది" అని అజిత్ తెలిపారు.