ఇంగ్లాండ్‌తో జరగబోయే రెండో టెస్టుకు టీమ్‌ఇండియాలో మార్పులు పక్కా! ఎన్ని మార్పులు చేస్తారన్న దానిపై స్పష్టత లేకపోయినా షాబాజ్ నదీమ్ స్థానంలో అక్షర్ పటేల్ రానున్నాడని తెలిసింది. స్వల్ప గాయంతో తొలి టెస్టుకు దూరమైన అతడు పూర్తిగా కోలుకున్నాడు.
"అక్షర్ మోకాలికి చిన్న గాయమే అయింది. ఇప్పటికే అతడు నెట్స్‌లో సాధన చేస్తున్నాడు. రెండు రోజుల్లో అతడు బౌలింగ్ సైతం చేస్తాడు. టెస్టు ఆడేందుకు మొదటి ప్రాధాన్యం అతడిదే. నిర్ణయం మాత్రం కెప్టెన్ విరాట్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రి, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్‌పై ఆధారపడి ఉంది." అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
చెపాక్‌లో జస్ప్రీత్ బుమ్రా, ఇషాంత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్ బాగానే బౌలింగ్ చేసినా షాబాజ్ నదీమ్, వాషింగ్టన్ సుందర్ మాత్రం బంతితో ఆకట్టుకోలేదు. నదీమ్ రెండు ఇన్నింగ్సుల్లో 59 ఓవర్లు విసిరి 233 పరుగులు ఇచ్చాడు. 4 వికెట్లు తీశాడు. సుందర్ సైతం 26 ఓవర్లు విసిరి 98 పరుగులు ఇచ్చాడు. వికెట్లేమీ తీయలేదు. అయితే తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌లో ఆకట్టుకున్నాడు.
సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బాగున్నాడని జట్టు వర్గాలు తెలిపాయి. టీమ్‌ఇండియా ఛేదనలో జోఫ్రా ఆర్చర్ వేసిన బంతికి అతడి వేలికి గాయమైంది. వెంటనే ఫిజియో నితిన్ పటేల్ వచ్చి చూశాడు. గాయం తీవ్రత మరీ ఎక్కువ లేకపోవడంతో స్కానింగ్‌కు సైతం పంపించలేదు. దాంతో రెండో టెస్టుకు అతడు అందుబాటులో ఉంటాడని తెలిసిపోయింది.
చెపాక్‌లో తొలి టెస్టు ఆడిన పిచ్ మరీ మందకొడిగా ఉంది. జీవం కనిపించలేదు. అయితే రెండో టెస్టుకు ఉపయోగించే కొత్త పిచ్ తొలి రోజు నుంచే టర్న్ అవుతుందని సమాచారం. టాస్ కీలకం అవ్వని పిచ్‌ను క్యూరేటర్లు రూపొందిస్తున్నారని తెలిసింది. సాధారణంగా నీళ్లు చల్లి పిచ్‌ను ఎండ పడేట్టు చేస్తే పిచ్‌పై త్వరగా పగుళ్లు వస్తాయి.
ఇదీ చూడండి: ఇంగ్లాండ్‌తో చివరి రెండు టెస్టులకూ జడ్డూ దూరం!