గాయంతో నాలుగు నెలలు ఆటకు దూరమైన టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా... త్వరలోనే మైదానంలో అడుగుపెట్టే అవకాశాలున్నాయి. వచ్చే నెలలో శ్రీలంక, ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగే సిరీస్‌ల కోసం జట్లను ఎంపిక చేసేందుకు... భారత సెలక్షన్ కమిటీ నేడు సమావేశం కానుంది. ఏదైనా ఒక సిరీస్ కోసం బుమ్రాను జట్టులోకి తీసుకునే వీలుందని సమాచారం. ఇటీవల విశాఖ వన్డే ముందు భారత బ్యాట్స్మన్లకు నెట్స్‌లో బౌలింగ్ వేసి తన ఫిట్నెస్ పరీక్షించుకున్నాడు. ఇతడితో పాటు మరో బౌలర్ దీపక్ చాహర్, టీమిండియా స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ భవితవ్యం ఈరోజు తేలనుంది.
సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా ఎమ్మెస్కే ప్రసాద్‌కు ఇదే చివరి సమావేశం కానుంది. అతడి పదవీ కాలం ఇటీవలే పూర్తయింది. కొత్త కమిటీని వచ్చే నెల ఆరంభంలో ప్రకటించే అవకాశం ఉంది. జనవరి 5 నుంచి శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్, 14 నుంచి ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ జరగనున్నాయి.