టీమ్ఇండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ గతేడాది ఐపీఎల్లో విఫల ప్రదర్శన చేశాడు. వికెట్లు తీయడంలో రాణించలేకపోయాడు. దీంతో టీమ్ఇండియాలోనూ స్థిరంగా చోటు దక్కించుకోలేకపోయాడు. తాజాగా దీనిపై కుల్దీప్ చిన్ననాటి కోచ్ కపిల్ పాండే స్పందించారు. ప్రతి ఆటగాడు కెరీర్లో ఎత్తుపల్లాలను చూస్తాడని తెలిపారు. దీంతో పాటు ఈటీవీ భారత్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు విషయాలు పంచుకున్నారు.
కుల్దీప్ అకాడమీలో చేరినప్పటి విషయం గుర్తుతెచ్చుకుంటూ..
కపిల్: చిన్నప్పుడు నా దగ్గరికి కోచింగ్ కోసం వచ్చినపుడు కుల్దీప్ బక్కపల్చగా ఉండేవాడు. అందుకే వాళ్ల నాన్న అతడిని అకాడమీలో చేర్పించాలనుకున్నారు. క్రీడల్లో పాల్గొంటే ఆరోగ్యంగా ఉంటాడని వాళ్ల నాన్న నమ్మాడు.
కుల్దీప్.. చైనామన్‌గా ఎలా మారాడంటే
కపిల్: మొదట నాలుగు నెలల శిక్షణ అనంతరం కుల్దీప్ను 'ఏమవ్వాలి అనుకుంటున్నావు' అని అడిగా. అతడు వసీం అక్రమ్‌లా బౌలింగ్ చేయాలనుకుంటున్నట్లు చెప్పాడు. కానీ నేను ఒప్పుకోలేదు. స్పిన్నర్‌గా ప్రయత్నించమని చెప్పా. అతడు వేసిన మూడు బంతుల తర్వాత అది చైనామన్ బౌలింగ్ శైలిలా అనిపించింది. అదే శైలితో రాణించి, టీమ్ఇండియాలోనూ చోటు సంపాదించాడు.
ఇంకా కుల్దీప్తో టచ్‌లో ఉన్నారా?
కపిల్: లాక్డౌన్ ప్రారంభంలో వీడియో కాల్ ద్వారా కుల్దీప్తో మాట్లాడేవాడ్ని. నిబంధనలు సడలించాక నెట్స్‌లో ప్రాక్టీస్‌కు వచ్చాడు. మళ్లీ అతడు ఫిట్‌గా మారేందుకు సాయపడ్డా.