భారత్-ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌పై విశ్లేషకులు, మాజీ క్రికెటర్లు చేస్తున్న చర్చల్లో ఎక్కువగా వినివిస్తున్న పేరు ఆసీస్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్. వన్డే సిరీస్‌లో భీకరఫామ్‌లో ఉన్న స్మిత్.. టెస్టు సిరీస్‌లో తేలిపోతున్నాడు. కనీసం రెండంకెల స్కోరును అందుకోలేకపోతున్నాడు. దీంతో టెస్టు ర్యాంకింగ్స్‌లో తన అగ్రస్థానాన్ని కోల్పోయి మూడో స్థానానికి పడిపోయాడు. ఈ నేపథ్యంలో స్మిత్‌కు డేవిడ్ వార్నర్ మద్దతుగా నిలిచాడు. గత యాషెస్ సిరీస్‌లో తనకి ఎదురైన గడ్డుకాలాన్ని ప్రస్తుతం స్మిత్ ఎదుర్కొంటున్నాడని అన్నాడు.
"కేన్ విలియమ్సన్ మంచి ప్రదర్శనతో స్మిత్ తన ర్యాంక్‌ను కోల్పోయాడు. అయితే అతడి గణాంకాలను చూడండి. ఇప్పటికీ సగటు 60కిపైనే ఉంది. ప్రతిఒక్కరూ ఫామ్‌ను కోల్పోవడం సహజం. 2019లో ఇంగ్లాండ్ పర్యటన (యాషెస్ సిరీస్)లో నేను పేలవ ప్రదర్శన చేశా. స్మిత్ సన్నద్ధమవ్వట్లేదని కాదు, అతడు సాధన చేస్తున్నాడు. కానీ మంచి బంతికి ఎవరైనా ఔట్ అవ్వాల్సిందే."
-వార్నర్, ఆసీస్ బ్యాట్స్‌మన్
యాషెస్ సిరీస్‌లో వార్నర్ అయిదు టెస్టుల్లో కేవలం 95 పరుగులే చేశాడు. మూడు సార్లు డకౌటయ్యాడు.
భారత్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో గాయపడిన వార్నర్ టీ20 సిరీస్‌తో పాటు తొలి రెండు టెస్టులకు దూరమయ్యాడు. మూడో టెస్టు నుంచి అందుబాటులో ఉంటాడని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు తెలిపింది. అయితే తాను పూర్తి ఫిట్‌నెస్ సాధించినట్లుగా భావించట్లేదని వార్నర్ తెలిపాడు. తొడకండరాల పట్టేసిన తర్వాత ప్రాక్టీస్‌కు దూరమయ్యానని, నేడు, రేపు జరిగే ప్రాక్టీస్ సెషన్ల అనంతరం తన ఫిట్‌నెస్‌పై స్పష్టత వస్తుందని అన్నాడు. తిరిగి బరిలోకి దిగడానికి సాధ్యమైనంత వరకు ప్రయత్నిస్తానని పేర్కొన్నాడు. నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా సిడ్నీ వేదికగా జనవరి 7న భారత్×ఆసీస్ మూడో టెస్టు ప్రారంభం కానుంది.