అది ఇంగ్లాండ్‌లోని హెడింగ్లే మైదానం. దానికి ఫాస్ట్‌బౌలర్ల వేట స్థలంగా పేరు. ఆ మ్యాచ్ జరుగుతున్నపుడు మబ్బులు కమ్మిన వాతావరణంలో పిచ్ పేసర్ల స్వర్గధామంగా మారింది. డెవాన్ మాల్కమ్, డెఫ్రీటస్, వాల్కిన్, ఫ్రింగిల్‌లతో కూడిన సాధారణ ఇంగ్లాండ్ పేస్ దళం బలమైన బ్యాటింగ్ ఉన్న వెస్టిండీస్‌ను వరుసగా 173, 162 పరుగులకు ఆలౌట్ చేసింది. వీళ్లే అలా రెచ్చిపోతే.. మాల్కమ్ మార్షల్, కర్ట్‌లీ ఆంబ్రోస్, కోట్నీ వాల్ష్, ప్యాటర్‌సన్‌లతో కూడిన భీకర వెస్టిండీస్ పేస్ విభాగం ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌ను ఎలా వణికించి ఉండాలి? అయితే వీరి ధాటికి అందరూ అల్లాడిపోయారు కానీ.. ఒక్కడు మాత్రం నిలిచాడు. చరిత్రాత్మక ఇన్నింగ్స్‌తో ఇంగ్లాండ్ 22 ఏళ్ల కరవు తీర్చాడు? ఎవరతడు? అసలా మ్యాచ్‌లో ఏం జరిగింది?
1991 జూన్‌లో ఇంగ్లాండ్ పర్యటనకు వచ్చింది వెస్టిండీస్. కొంత వైభవం తగ్గినా అప్పటికీ ఆ జట్టంటే హడలే. బ్యాటింగ్‌లో రిచర్డ్స్, హేన్స్.. బౌలింగ్‌లో మార్షల్, ఆంబ్రోస్, వాల్ష్ లాంటి మేటి ఆటగాళ్లు ఆ జట్టు సొంతం. ఇంగ్లాండ్ చూస్తే బలహీనం. సిరీస్ సంగతలా ఉంచితే సొంతగడ్డపై వెస్టిండీస్‌పై ఓ టెస్టు గెలిచి 22 ఏళ్లయింది. దీంతో అయిదు టెస్టుల సిరీస్‌లో కరీబియన్ జట్టే ఫేవరెట్‌గా బరిలోకి దిగింది. ఆట అంచనాలకు తగ్గట్లే ఆరంభమైంది. తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 198 పరుగులకే ఆలౌటైంది. అయితే తర్వాత బ్యాటింగ్ ఆరంభించిన విండీస్ ఇంతకన్నా తడబడింది. ఇంగ్లాండ్ పేసర్ల ధాటికి తొలి 173 పరుగులకే కుప్పకూలింది. కానీ బౌలర్ల స్వర్గధామంగా మారుతున్న పిచ్‌పై ఇంగ్లాండ్ బౌలర్లే అంతగా చెలరేగిపోతే.. తర్వాత కరీబియన్ బృందం ధాటికి ఇంగ్లిష్ జట్టు అసలు నిలవగలదా అని సందేహం! అనుకున్నట్లే రెండో ఇన్నింగ్స్‌లో 38 పరుగులకే 3 వికెట్లు పడిపోయాయి. ఇంగ్లాండ్ 100 చేసినా గొప్పే అనుకున్నారంతా. కానీ 252 పరుగులు చేసింది. అందుక్కారణం గూచ్.
తొలి ఇన్నింగ్స్‌లో 34 పరుగులు చేసిన గ్రాహమ్.. రెండో ఇన్నింగ్స్‌లో మరింత ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ చేశాడు. భీకర పేసర్లను చూసి బెదిరిపోలేదు. ఎదురుదాడికి దిగాడు. మార్షల్, ఆంబ్రోస్, వాల్ష్ ఎంత వేగంగా బంతులు విసిరితే అంతే వేగంగా బౌండరీలకు పంపాడు. ఒక దశ దాటాక ఇక లాభం లేదని.. గ్రాహమ్ పక్కటెముకల్ని లక్ష్యంగా చేసుకుని షార్ట్ బంతులు విసిరారు విండీస్ బౌలర్లు. అయితే గూచ్ అదురు బెదురు లేకుండా వాటిని బౌండరీలకు పంపాడు. ఆరంభంలో ఫ్లిక్ షాట్లు ఆడిన అతను.. ఆ తర్వాత ధీమాగా హుక్ షాట్లకు దిగాడు. మిగతా బ్యాట్స్‌మెన్ బెంబేలెత్తిపోయిన బంతుల్ని అతను అలవోకగా బౌండరీలకు పంపుతుంటే.. స్టేడియం హోరెత్తిపోయింది. ఆ షాట్లను వర్ణించడానికి వ్యాఖ్యాతలకు మాటలు సరిపోలేదు. వికెట్‌కు నేరుగా, ఆఫ్ సైడ్‌లో గూచ్ ఆడిన డ్రైవ్ షాట్లు కూడా వేటికవే ప్రత్యేకం. మిగతా వికెట్లు పడుతున్నపుడు హుషారుగా కనిపించిన విండీస్ పేసర్లు.. గూచ్ తమ బంతుల్ని బౌండరీలకు మళ్లిస్తుంటే అసహనంతో, నిస్సహాయంగా నిలబడ్డ దృశ్యాలు ఆ వీక్షకులకు ఇంకా గుర్తుండే ఉంటాయి. ఇంగ్లాండ్ స్కోరులో 60 శాతం గ్రాహమ్‌దే. అతడి తర్వాత అత్యధిక వ్యక్తిగత స్కోరు 27 మాత్రమే. 8 మంది రెండంకెల స్కోరే చేయలేదు.
క్షణ క్షణం పరీక్ష పెట్టిన ఏడున్నర గంటల వ్యవధిలో నాణ్యమైన 331 బంతులెదుర్కొన్న గ్రాహమ్.. ఆఖరి వికెట్ పడ్డాక 154 పరుగులతో అజేయంగా పెవిలియన్‌కు కదిలాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఆణిముత్యాల్లాంటి 18 ఫోర్లున్నాయి. 11 ఏళ్ల వ్యవధిలో ఓపెనర్‌గా దిగి చివరి వరకు అజేయంగా నిలిచిన తొలి ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్ గూచ్‌యే. ఆ సమయంలో ప్రత్యర్థులతో పాటు స్టేడియమంతా అతణ్ని చప్పట్లతో సాగనంపిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని కూడా కలిపి విండీస్ ముందు 278 పరుగుల లక్ష్యాన్ని నిలిపితే.. రిచర్డ్స్ సేన ఈసారి 162 పరుగులకే చేతులెత్తేసి గూచ్ ఇన్నింగ్స్ విలువను మరింత పెంచింది. పిచ్ క్వాలిటీ ఇండెక్స్ (పీక్యూఐ) ప్రకారం.. 25-35 మధ్య స్కోరున్న పిచ్ బౌలర్లకు స్వర్గధామం అన్నట్లే. ఈ మ్యాచ్ వేదికైన పిచ్ పీక్యూఐ స్కోరు 34. గూచ్ ఇన్నింగ్స్‌కు సాటిలేదనడానికి ఇది మరో రుజువు!