పుణె వేదికగా టీమ్ఇండియాతో జరిగిన రెండో వన్డేలో ఇంగ్లాండ్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. పర్యటక బ్యాట్స్‌మెన్ ధాటికి సిక్సర్ల వర్షం కురిసింది. బంతి పడితే చాలు బౌండరీ దాటాల్సిందే అన్నట్టు సాగింది ఇంగ్లీష్ ఆటగాళ్ల విధ్వంసం. భారత బౌలర్లలో ప్రసిధ్ క్రిష్ణ 2, భువనేశ్వర్ కుమార్ ఒక వికెట్ తీసుకున్నారు. ఈ గెలుపుతో మూడు వన్డేల సిరీస్‌ను 1-1తో సమం చేసింది ఇంగ్లాండ్. చివరిదైన మూడో వన్డే ఆదివారం(మార్చి 28న) జరగనుంది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోహ్లీ సేన నిర్ణీత 50 ఓవర్లలో 336 పరుగుల భారీ స్కోరు చేసింది. భారత ఆటగాళ్లలో కేఎల్ రాహుల్ శతకంతో రాణించగా.. కెప్టెన్ విరాట్ కోహ్లీ, యువ బ్యాట్స్‌మెన్ రిషభ్ పంత్ అర్ధ సెంచరీలు చేశారు. ఇంగ్లాండ్ బౌలర్లలో టామ్ కరన్, తోప్లే చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.
అనంతరం 337 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌కు మంచి ఆరంభం లభించింది. తొలి నుంచే 6 రన్‌రేట్‌తో పరుగులు సాధించిన పర్యటక జట్టు.. మొదటి వికెట్‌కు 110 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. లేని రన్‌కు ప్రయత్నించి.. ఓపెనర్ రాయ్ వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన బెన్ స్టోక్స్.. బెయిర్ స్టోకు సహకారం అందించాడు.
బెయిర్ స్టో-స్టోక్స్ విధ్వంసం..
క్రీజులో ఉన్నంత వరకు బౌండరీల వర్షం కురిపించింది బెయిర్ స్టో-స్టోక్స్ ద్వయం. టీ20ని తలపిస్తూ 117 బంతుల్లోనే 177 పరుగులు సాధించింది. బెన్ స్టోక్స్(52 బంతుల్లో 99; 4 ఫోర్లు, 10 సిక్స్‌లు), బెయిర్ స్టో(112 బంతుల్లో 124; 11 ఫోర్లు, 7 సిక్స్‌లు) బౌండరీలతో విరుచుకుపడ్డారు. వీరిద్దిరి ధాటికి కృనాల్ పాండ్య (6 ఓవర్లలో 72 పరుగులు), కుల్దీప్ యాదవ్ (10 ఓవర్లలో 84 పరుగులు) బాధితులుగా మారిపోయారు. వరుస ఓవర్లలో ఇంగ్లాండ్ మూడు వికెట్లు కోల్పోయినప్పటికీ.. అప్పటికే వీరిద్దరూ చేయాల్సిన నష్టం చేశారు.
తర్వాత క్రీజులోకి వచ్చిన లివింగ్‌స్టోన్.. డేవిడ్ మలన్‌తో కలిసి మిగతా పని పూర్తి చేశాడు. లివింగ్‌స్టోన్ కూడా రెండు సిక్స్‌లు బాదాడు. కేవలం ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌లో 20 సిక్స్‌లు నమోదయ్యాయి. కాగా, భారత బ్యాట్స్‌మెన్ 14 సిక్స్‌లు కొట్టారు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో 34 సిక్సర్లు నమోదయ్యాయి. కేవలం 31 నుంచి 35 ఓవర్ల(కేవలం నాలుగు)లో 87 పరుగులు పిండుకుంది పర్యటక జట్టు.
ఇదీ చదవండి: రాహుల్.. శతకం అభివాదం వెనుక కారణమిదే