117 రోజుల కరోనావాసం ముగిసింది. క్రికెట్ మళ్లీ ఊపిరి పీల్చుకుంది. మైదానంలో అభిమానుల హంగామా లేదన్న మాటే తప్పితే.. దేనికీ లోటు లేదు. పోటా పోటీ ఆట.. ఆటగాళ్ల అద్భుత నైపుణ్యాలు.. రసవత్తర మలుపులు.. ఉత్కంఠభరిత పతాక సన్నివేశం.. చివరికి సిరీస్ ముంగిట ఉన్న అంచనాలకు భిన్నమైన ఫలితం! మొత్తంగా కరోనా విరామం తర్వాత తొలి ఆట బంపర్ హిట్!
ప్రపంచమంతా కరోనాతో అల్లాడుతున్న వేళ.. ఆ మహమ్మారి విసురుతున్న సవాల్‌ను కాచుకుంటూ ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు 'బయో బుడగ'లో నిర్వహిస్తున్న సిరీస్‌లో తొలి పోరు ఏ అడ్డంకీ లేకుండా విజయవంతంగా పూర్తయింది. క్రికెట్ ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా తిలకించిన ఇంగ్లాండ్-వెస్టిండీస్ తొలి టెస్టులో ఆట అత్యుత్తమంగా సాగడం, అభిమానుల్ని అలరించడంతో క్రికెట్ ప్రపంచంలో మళ్లీ ఉత్సాహం వచ్చింది.
నాలుగు నెలలైంది 'లైవ్' క్రికెట్ ఊసులు వినిపించి. కరోనా కారణంగా ఎన్నో సిరీస్‌లు రద్దయ్యాయి, వాయిదా పడ్డాయి. ఐపీఎలూ జరగలేదు. క్రికెట్ అభిమానులకు అలవాటు లేని అనుభవమిది. కరోనా భయం వెంటాడుతుండగా.. భారత్ సహా చాలా క్రికెట్ దేశాలు కార్యకలాపాలన్నీ ఆపేశాయి. టెన్నిస్‌లో కరోనాను పట్టించుకోకుండా ఓ ఈవెంట్ జరిపిస్తే.. జకోవిచ్ సహా మరికొందరు ఆటగాళ్లు వైరస్ బారిన పడ్డారు.
ఇలాంటి సమయంలో ఇంగ్లాండ్ బోర్డు టెస్టు సిరీస్ అని.. కరోనా ముప్పు లేకుండా అన్ని జాగ్రత్తలతో ‘బయో సెక్యూర్’ విధానంలో మ్యాచ్‌లు నిర్వహిస్తామని ప్రకటిస్తే.. ఇది సాధ్యమేనా.. సురక్షితమేనా? అభిమానులను అనుమతించకుంటే ఏం మజా ఉంటుంది.. ఖాళీ స్టేడియాలో మ్యాచ్ జరిపిస్తే ఆడేందుకు, చూసేందుకు ఏం ఉత్సాహం వస్తుంది.. ఇంగ్లాండ్‌కు దాని సొంతగడ్డపై వెస్టిండీస్ ఏమాత్రం పోటీ ఇస్తుంది.. ఇలా ఎన్నెన్నో సందేహాలు కలిగాయి. కానీ ఆ అనుమానాలన్నీ మ్యాచ్ అయ్యేసరికి దూదిపింజల్లా తేలిపోయాయి.
అది లోటే కానీ..
నిజమే.. స్టేడియం ఖాళీగా ఉండడం, అభిమానుల సందడి లేకపోవడం ఈ మ్యాచ్‌లో లోటే. బోసిపోయిన స్టాండ్స్‌ను చూడటం అందరికీ ఇబ్బందే. వాళ్ల అరుపులే, చప్పట్ల శబ్దం లేకుండా ఆడుతుంటే క్రికెటర్లకు కూడా ఏదోలా ఉండి ఉంటుంది. ఇక టీవీలో మ్యాచ్ చూసే వారి పరిస్థితి చెప్పాల్సిన పని లేదు. మరోవైపు తొలి రోజు వర్షం వల్ల చాలా వరకు ఆటకు నష్టం వాటిల్లడంతో మ్యాచ్‌పై అభిమానుల్లో పోతుందేమో అన్న ఆందోళనా కనిపించింది. కానీ రెండో రోజు నుంచి కథ మారింది. ఆట సాగింది. అందరి దృష్టినీ ఆకర్షించింది. ఇంగ్లాండ్ 204 పరుగులకే ఆలౌటైపోవడం, వెస్టిండీస్ పైచేయి సాధించడం వల్ల అందరి దృష్టి ఇటు మళ్లింది. అక్కడి నుంచి ఆట మలుపులు తిరుగుతూ, ఆధిపత్యం చేతులు మారుతూ సాగడంతో మిగతా విషయాలన్నీ పట్టించుకోకుండా అందరూ మ్యాచ్‌కు అంకితమైపోయారు.
నాలుగో రోజు ఓ దశలో ఇంగ్లాండ్ జోరు చూస్తే.. మ్యాచ్ ఏకపక్షం అవుతుందేమో, ఆతిథ్య జట్టు సులువుగా గెలిచేస్తుందేమో అనిపించింది. కానీ చివర్ల్లో విండీస్ పుంజుకుని మ్యాచ్‌ను రసవత్తర ముగింపు ముంగిట నిలిపింది. చివరి రోజు మ్యాచ్ ఆసక్తికర మలుపులతో, ఉత్కంఠభరితంగా సాగి క్రికెట్ అభిమానులందరికీ కావాల్సినంత మజాను పంచింది. మామూలు అభిమానులే కాదు.. ఆటగాళ్లు, మాజీలు, క్రికెట్ పాలకులు అందరూ ఈ మ్యాచ్‌ను ఎంతగానో ఆస్వాదించారని వారి స్పందన చూస్తేనే అర్థమవుతుంది.
వాళ్ల గెలుపుతో మజా
ఇప్పుడీ మ్యాచ్ గురించి క్రికెట్ ప్రపంచమంతా మాట్లాడుతుండటానికి మరో ముఖ్య కారణం.. ఇందులో వెస్టిండీస్ గెలవడం. ఇంగ్లాండ్ ముందు విండీస్ బలహీనం అన్నది స్పష్టం. అందులోనూ ఇంగ్లాండ్‌ను ఇంగ్లాండ్‌లో ఓడించడం పెద్ద జట్లకూ కష్టమే. అలాంటిది కరీబియన్ జట్టు గెలవడం పెద్ద షాక్. నిరుడు సొంతగడ్డపై ఇంగ్లాండ్‌ను ఓడించినప్పటికీ.. ఇంగ్లాండ్‌లో ఆ జట్టు పప్పులుడకవనే అనుకున్నారంతా. మ్యాచ్‌లో మూడో రోజు వరకు విండీస్ ఆధిపత్యం చలాయించినా.. ఇంగ్లాండ్ పుంజుకుని ప్రత్యర్థిని వెనక్కి నెడుతుందనే నమ్మకంతోనే ఉన్నారు ఆ జట్టు అభిమానులు. మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ ఇదే మాట అన్నాడు. ఒక దశలో అతడి అంచనా నిజమయ్యేలాగే కనిపించింది. కానీ చేజారేట్లు కనిపించిన మ్యాచ్‌ను విండీస్ ఒడిసిపట్టుకుంది. సంచలన విజయాన్నందుకుంది.
బలహీన విండీస్ తొలి మ్యాచ్‌లో గెలవడంతో అందరికీ సిరీస్ మీద అమితాసక్తి ఏర్పడింది. ఇప్పుడిక కరీబియన్ జట్టును దెబ్బకు దెబ్బ తీయాలని ఇంగ్లాండ్ కసితో ఉంటుందనడంలో సందేహం లేదు. పైగా రెండో టెస్టుకు కెప్టెన్ రూట్ వస్తున్నాడు. మరోవైపు విండీస్ విజయోత్సాహంతో ఉంది. ఇప్పటికైతే మ్యాచ్ నిర్వహణలోనూ లోపాల్లేవు. కరోనా ప్రభావం కనిపించలేదు. ఇలాగే సురక్షితంగా, పోటాపోటీగా సాగి.. క్రికెట్‌తో పాటు అన్ని ఆటలకూ ఈ సిరీస్ మార్గనిర్దేశం చేస్తుందని ఆశిద్దాం.
"ఇరు జట్ల ఆటగాళ్లు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఉత్కంఠభరిత సమయంలో బ్లాక్‌వుడ్ కీలక ఇన్నింగ్స్ ఆడి వెస్టిండీస్‌ను గెలిపించాడు. ఇది ఓ ముఖ్యమైన విజయం. సిరీస్ భలే ఆసక్తికరంగా మారింది"
- సచిన్, భారత దిగ్గజ క్రికెటర్.
"ఆహా.. వెస్టిండీస్ ఎంత గొప్ప విజయం సాధించింది. టెస్టు క్రికెట్ అత్యుత్తమ ప్రదర్శనను చూశాం"
- విరాట్ కోహ్లీ, టీమ్ఇండియా సారథి.
ఇది చూడండి : 'ప్రస్తుతం బౌలర్లంతా రివర్స్ స్వింగ్ మర్చిపోండి'