సౌథాంప్టన్ సిరీస్ ఆరంభ మ్యాచ్‌లో వెస్టిండీస్ చేతిలో షాక్ తిన్న ఇంగ్లాండ్‌కు.. మాంచెస్టర్‌లోనూ పరిస్థితులు కలిసి రావడం లేదు. ఎంతో పట్టుదలతో బ్యాటింగ్ చేసి భారీ స్కోరు సాధించినా.. వరుణుడు ఆ జట్టు జోరును అడ్డుకున్నాడు. విండీస్‌ను సాధ్యమైంత తక్కువ స్కోరుకు ఆలౌట్ చేయాలన్న లక్ష్యంతో సిద్ధమైన ఆతిథ్య జట్టుకు.. వర్షం ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు.
ఎడతెరిపిలేని వర్షం..
శనివారం ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా వర్షం పడుతూనే ఉండటం.. రెండో సెషన్లోనూ వర్షం కొనసాగడం వల్ల ఒక్క బంతీ పడకుండానే మూడో రోజు ఆట రద్దయిపోయింది. రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌ను ఇంగ్లాండ్ 469/9 వద్ద డిక్లేర్ చేయగా.. అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన విండీస్ ఆట ఆఖరుకు 14 ఓవర్లలో వికెట్ నష్టానికి 32 పరుగులు చేసింది. ఓపెనర్ క్యాంప్‌బెల్ (12) ఔట్ కాగా.. అతడి భాగస్వామి బ్రాత్‌వైట్ (6 బ్యాటింగ్)తో పాటు నైట్ వాచ్‌మన్ అల్జారి జోసెఫ్ (14 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.
ట్రోఫీ విండీస్ చేతిలోనే!
తొలి మ్యాచ్‌లో విండీస్ గెలిచిన నేపథ్యంలో సిరీస్‌పై ఆశలు నిలవాలంటే ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ నెగ్గడం తప్పనిసరి. ఎందుకంటే విజ్డెన్ ట్రోఫీలో భాగంగా గత ఏడాది వెస్టిండీస్‌లో జరిగిన సిరీస్‌లో ఆతిథ్య జట్టు 2-0తో ఇంగ్లాండ్‌కు షాకిచ్చింది. ప్రస్తుత సిరీస్ డ్రా అయినా.. ట్రోఫీ ఆ జట్టు చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి రెండో టెస్టులో ఫలితం తేలకుంటే.. చివరి మ్యాచ్‌లో ఇంగ్లాండ్ గెలిచినా ప్రయోజనం ఉండదు.
19 వికెట్లు తీయాలి..
తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేసిన ఇంగ్లీష్ జట్టు.. బౌలింగ్‌లోనూ సత్తా చాటి కరీబియన్ జట్టును ఓడించాలనే పట్టుదలతో ఉంది. అయితే ఒక రోజు పూర్తిగా ఆట రద్దయిన నేపథ్యంలో.. చివరి రెండు రోజుల్లో ప్రత్యర్థిని రెండుసార్లు ఆలౌట్ చేస్తే తప్ప ఇంగ్లాండ్ గెలిచేందుకు అవకాశం లేదు.
ఆది, సోమ వారాల్లో వర్షం పడే సూచనలు తక్కువగానే ఉన్నాయి. 9 వికెట్లు చేతిలో ఉన్న విండీస్.. ఇంకా 437 పరుగులు వెనుకబడి ఉంది. రెండు రోజుల్లో 19 వికెట్లు తీస్తేనే సిరీస్‌పై ఆశలు నిలబెట్టుకోనుంది ఇంగ్లాండ్. నాలుగో రోజు పూర్తి ఆట సాధ్యమైతే.. సాధ్యమైనంత త్వరగా ప్రత్యర్థిని ఆలౌట్ చేసి.. ఫాలోఆన్ ఇవ్వాలన్నది ఇంగ్లీష్ జట్టు ఆలోచన. మరి వరుణుడు ఏమాత్రం కరుణిస్తాడో.. ఇంగ్లీష్ బౌలర్లు ఏమేర రాణిస్తారో చూడాలి.