అంతర్జాతీయ క్రికెట్ స్తంభించి దాదాపు రెండు నెలలు గడిచింది. ఆటగాళ్లు ఇళ్లకే పరిమితమయ్యారు. ఆయా క్రికెట్ బోర్డుల కార్యాలయాలను తాత్కాలికంగా మూసేశారు. అధికారులు ఇంటినుంచే పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది క్రీడా రంగం. ప్రపంచంలోనే అత్యధికులు చూసే ఫుట్‌బాల్, క్రికెట్‌పై ఈ ప్రభావం మరింత తీవ్రంగా ఉంది. ఇలాంటి సమయంలో క్రికెట్‌ను మళ్లీ పునరుద్ధరించే చర్యలు చేపట్టింది ఇంగ్లాండ్ ప్రభుత్వం. క్రీడలపై ఆంక్షలు సడలిస్తూనే.. కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది.
అభిమానులకు నో ఎంట్రీ
దేశవ్యాప్తంగా అన్ని క్రీడలకు జరిపేందుకు పచ్చజెండా ఊపింది ఇంగ్లాండ్. అయితే ప్రేక్షకులు లేకుండా ఖాళీ మైదానాల్లోనే నిర్వహించుకోవాలని స్పష్టం చేసింది. ఆటగాళ్లు భౌతిక దూరం పాటించాలని, ఈ మార్గదర్శకాలు కచ్చితంగా అమలు చేయాలని చెప్పింది.
"నిరీక్షణ తొలగిపోయింది. రక్షణ పద్ధతులు పాటిస్తూ, బ్రిటన్ దేశంలో క్రీడలు మొదలుకానున్నాయి. ఆయా క్రీడా ప్రాంతాలపై పర్యవేక్షణ మాత్రం తప్పకుండా ఉంటుంది"
-- ఒలీవర్ డవ్డెన్, డీసీఎంఎస్(డిజిటల్,కల్చర్,మీడియా,స్పోర్ట్స్)విభాగాధిపతి
వాళ్లే ఎంపిక!
క్రికెటర్లు శిక్షణా శిబిరాలకు హాజరు కావాలని ఇంగ్లాండ్ వేల్స్ క్రికెట్ బోర్డు, శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఎవరైతే ప్రాక్టీస్‌లో పాల్గొంటారో వారు జో రూట్ సారథ్యంలోని టెస్టు జట్టు, ఇయాన్ మోర్గాన్ నేతృత్వంలోని పరిమిత ఓవర్ల టీమ్‌లో చోటు సాధించొచ్చని తెలిపింది.
ప్రీమియర్ లీగ్ అప్పుడే?
ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించింది ప్రీమియర్ లీగ్. జూన్ మూడో వారం నుంచి టోర్నీని తిరిగి ప్రారంభించాలనే యోచనలో ఉన్న నిర్వాహకులు... ప్రభుత్వ ఆదేశాలతో మ్యాచ్‌లు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మెగాటోర్నీలో షెఫీల్డ్ యునైటెడ్, మాంచెస్టర్ సిటీ, ఆస్టన్ విల్లా, అర్సెనాల్ జట్లు తలపడనున్నాయి. ఇప్పటికే కరోనా కారణంగా మధ్యలో ఆగిన వీటి మ్యాచ్‌లను.. జూన్ 19-21 మధ్య జరపనున్నారు.