కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని క్రికెట్లో బంతి మెరుపు కోసం లాలాజలం వాడటం నిషేధమని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఇప్పటికే ప్రకటించింది. దీంతో బంతిని స్వింగ్ చేయడానికి ఉమ్మి ఎంతో ముఖ్యమని కొంతమంది బౌలర్లు అభిప్రాయపడ్డారు. అయితే ఐసీసీ నిబంధనలు దృష్టిలో ఉంచుకుని లాలాజలం బదులుగా చెమటను వాడనున్నట్లు ఇంగ్లాండ్ బౌలర్ మార్క్ వుడ్ వెల్లడించాడు.
"కరోనా కారణంగా బంతికి లాలాజలాన్ని రాయడం నిషేధించడం వల్ల దానికి ప్రత్యామ్నాయంగా చెమటను రాసి బంతికి మెరుపు తెప్పిస్తాం. అండర్సన్, జోఫ్రా ఆర్చర్లతో పాటు నేనూ అదే పని చేయనున్నా".
-మార్క్ వుడ్, ఇంగ్లాండ్ బౌలర్
వెస్టిండీస్‌తో జరుగుతోన్న మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 204 పరుగులకే ఇంగ్లాండ్ ఆలౌట్ అయ్యింది. "ఈ మ్యాచ్‌లో మాకు తగిన సమయం రాలేదు. విండీస్ ఆటగాళ్లు బాగా బౌలింగ్ చేశారు. క్రెడిట్ అంతా వాళ్లకే దక్కుతుంది. కానీ, 204 అనేది చాలా చిన్న టార్గెట్. 250 నుంచి 300 పరుగుల వరకు మేము ఆశించాం. ప్రత్యర్థులు మంచి లైన్ అండ్ లెన్త్‌తో బౌలింగ్ చేశారు." అని తెలిపాడు వుడ్.