ఆస్ట్రేలియాలో జరిగిన మహిళల టీ20 ప్రపంచకప్‌నకు ప్రపంచవ్యాప్తంగా అభిమానుల నుంచి గొప్ప స్పందన వచ్చింది. ఫలితంగా అమ్మాయిల ఆటకు సంబంధించి ప్రత్యేక ప్రసారహక్కుల కోసం ఐసీసీ.. బిడ్లను ఆహ్వానించే అవకాశముంది. 2023 నుంచి 2031 మధ్య జరిగే మ్యాచ్‌ల కోసం ఈ నిర్ణయం తీసుకోనుంది.
"ప్రత్యేక ప్రసార హక్కుల కోసం బిడ్లను ఆహ్వానించాలనే ఆలోచన ఉంది. ఆ దిశగా అడుగులు పడనున్నాయి. మహిళల టీ20 ప్రపంచకప్‌ను అధిక సంఖ్యలో ప్రేక్షకులు వీక్షించారు. కాబట్టి అమ్మాయిల క్రికెట్ ప్రత్యేక ప్రసారంపై దృష్టి పెట్టాలి. దానికి అంత విలువ ఉంది. 101 కోట్ల వీడియో వీక్షణలతో ఆ ప్రపంచకప్.. వీక్షణల్లో గతేడాది పురుషుల వన్డే ప్రపంచకప్ తర్వాత రెండో స్థానంలో నిలిచింది."
-ఐసీసీ సభ్యుడు
మహిళల క్రికెట్ మార్కెట్ విలువ పెరగడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆటకు ఆదరణ దక్కడంలో భారత అమ్మాయిల జట్టు పాత్ర ఎంతో కీలకమైంది. ఆస్ట్రేలియాతో భారత్ ఫైనల్ మ్యాచ్‌ను మన దేశంలో దాదాపు 90 లక్షల మంది చూశారు. టోర్నీ సాంతం చూసుకుంటే దేశంలోని అభిమానులంతా కలిసి 540 కోట్ల నిమిషాల సమయాన్ని వెచ్చించారు. అందులో ఫైనల్ మ్యాచ్ వాటానే 178 కోట్ల నిమిషాలు. 2018 టీ20 ప్రపంచకప్ ఫైనల్‌తో పోల్చుకుంటే ఇది 59 రెట్లు ఎక్కువ.