85 ఏళ్ల 'రంజీ' క్రికెట్ చరిత్రలో అద్భుతం జరిగింది. ఫాలో ఆన్ ఆడి గెలిచిన తొలి జట్టుగా ఝార్ఖండ్ నిలిచింది. అగర్తలా వేదికగా త్రిపురతో గురువారం జరిగిన మ్యాచ్‌లో ఈ విశేషం చోటు చేసుకుంది. ఝార్ఖండ్ తరఫున ఇషాంక్ జగ్గీ, సౌరభ్ తివారీ శతకాలు చేసి విజయంలో కీలక పాత్ర పోషించారు.
త్రిపురకు షాక్..
త్రిపుర సారథి మిలింద్ (59), హర్మీత్ సింగ్ (56) అర్ధశతకాలతో రాణించడం వల్ల తొలుత బ్యాటింగ్ చేసిన ఆ జట్టు.. మొదటి ఇన్నింగ్స్‌లో 298 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన ఝార్ఖండ్.. రాణా (4/42), అభిజిత్ (3/43) ధాటికి 136 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా 153 పరుగుల ఆధిక్యంలో నిలిచిన ఆతిథ్య జట్టు.. ఝార్ఖండ్‌ను ఫాలోఆన్ ఆడించింది.
రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన ఝార్ఖండ్ అద్భుతంగా పుంజుకుని భారీస్కోరు సాధించింది. ఆ జట్టు బ్యాట్స్మెన్లలో ఇషాంక్ జగ్గీ 107 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. మరో ఎండ్‌లో ఉన్న సౌరభ్ తివారీ 122 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఫలితంగా 8 వికెట్ల నష్టానికి 418 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశారు.
అనంతరం 266 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన త్రిపుర.. ఝార్ఖండ్ బౌలర్లకు తలవంచింది. పర్యాటక జట్టులో ఆశిష్ కుమార్ 5 వికెట్లు తీశాడు. అతడికి తోడుగా ఎమ్బీ మురుగేశన్ మిగతా వికెట్లు పడగొట్టి, త్రిపురను 103 పరుగులకే ఆలౌట్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. త్రిపుర బ్యాట్స్మెన్లలో మణిశంకర్(103) ఒంటరి పోరాటం చేసినా జట్టును గెలిపించలేకపోయాడు. తద్వారా రంజీ టోర్నీ చరిత్రలో ఫాలో ఆన్ ఆడి గెలిచిన తొలి జట్టుగా రికార్డు సృష్టించింది ఝార్ఖండ్ .
గతంలో ఈడెన్లోనూ ఈ వింత...
2001లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్ అప్పట్లో పెద్ద చర్చనీయాంశమైంది. ఈ మ్యాచ్‌లో లక్ష్మణ్ చేసిన ప్రదర్శన అతడి కెరీర్లో వెరీ వెరీ స్పెషల్ అయింది. ఈ టెస్టులో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగుల భారీ స్కోరు సాధించింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 171 పరుగులకే కుప్పకూలింది.
ఫాలోఆన్‌కు దిగిన టీమిండియా.. అద్భుతమైన ఆటతీరు ప్రదర్శించింది. మొదటి ఇన్నింగ్స్‌లో ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన లక్ష్మణ్.. రెండో ఇన్నింగ్స్‌లో వన్‌డౌన్‌లో వచ్చి 281 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ద్రవిడ్(180) చక్కని సహకారం అందించాడు. ఫలితంగా భారత జట్టు 657/7 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. చివరి రోజు 75 ఓవర్లలో 384 పరుగులు చేస్తే ఆస్ట్రేలియా విజయం సాధిస్తుందనగా... భారత బౌలర్ల ధాటికి 212 రన్స్‌కే ఆలౌట్ అయింది ఆస్ట్రేలియా. తొలి ఇన్నింగ్స్‌లో హ్యాట్రిక్ సహా 7 వికెట్లు సాధించిన హర్భజన్.. రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లతో ఆసీస్ వెన్ను విరిచాడు. ఫలితంగా 171 పరుగుల తేడాతో నెగ్గిన భారత జట్టు.. క్రికెట్ చరిత్రలో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. టెస్టుల్లో 17 వరుస విజయాలు సాధించిన ఆసీస్‌ను నిలువరించి చరిత్ర సృష్టించింది.