ఏటా ఒక ఐసీసీ టోర్నీ నిర్వహించాలని చూస్తున్న అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) నిర్ణయానికి వ్యతిరేకంగా నాలుగు మెగా జట్ల టోర్నీ నిర్వహించడానికి బీసీసీఐ ముందడుగు వేసింది. అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ ఇదివరకే ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డును సంప్రదించి ఈ విషయాన్ని ప్రతిపాదించాడు. ఈసీబీ అందుకు సుముఖంగా ఉందని తెలుస్తోంది. ఈ మెగా టోర్నీలో భారత్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాతో పాటు మరో ఉత్తమ జట్టు పాల్గొనే అవకాశం ఉంటుంది.
"మా ఆటపై ప్రభావం చూపే విషయాలను చర్చించడానికి మేం తరచూ పెద్ద జట్ల బోర్డులతో సమావేశమవుతాం. తాజాగా బీసీసీఐతో జరిగిన సమావేశంలో నాలుగు మెగా జట్ల టోర్నీ నిర్వహించాలనే ప్రతిపాదన వచ్చింది. అయితే, ఈ టోర్నీ నిర్వహణ సాధ్యాలపై ఇతర ఐసీసీ జట్లతో చర్చించడానికి మేం సిద్ధంగా ఉన్నాం."
-ఈసీబీ ఉన్నతాధికారి
ఒకవేళ ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే.. 2021 నుంచి మూడు పెద్ద జట్లు రొటేషనల్ పద్ధతిలో ఈ టోర్నీని నిర్వహిస్తాయి. తద్వారా ఆయా క్రికెట్ బోర్డులు ఆర్థికంగా లాభపడే అవకాశముంది. ఇదిలా ఉండగా ఐసీసీ.. మూడు దేశాలకు మించి టోర్నీలు నిర్వహించడానికి అనుమతించదు. నాలుగు దేశాల టోర్నీపై భారత్, ఇంగ్లాండ్ ఇప్పటికే సుముఖత వ్యక్తం చేశాయి. ఇక ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు మాత్రమే తమ నిర్ణయాన్ని వెల్లడించాల్సి ఉంది. ఆసీస్ కోచ్ జస్టిన్ లాంగర్ మంగళవారం ఈ విషయంపై స్థానిక మీడియాతో మాట్లాడాడు.
"అన్నీ సానుకూలంగా జరిగి ఈ మెగా టోర్నీ నిర్వహిస్తే క్యాలెండర్ మొత్తం నిండిపోతుంది. ప్రపంచ క్రికెట్‌లో ఆటగాళ్ల షెడ్యూల్ చాలా బిజీగా ఉంటుంది. ఈ విషయం మనందరికీ తెలిసిందే. కాబట్టి చాలా మంది దీన్ని వ్యతిరేకిస్తారని అనుకుంటున్నా. ఒకవేళ ఇది నిజమైతే షెడ్యూల్ మరింత బిజీ అయిపోతుంది" అని లాంగర్ వివరించాడు.
ఇవీ చూడండి.. ఈ దశాబ్దంలో అత్యధిక వికెట్ల వీరుడిగా అశ్విన్ రికార్డ్