వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్ భారత జట్టులో స్థానం దక్కించుకుంటానని టీమిండియా వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ ధీమా వ్యక్తం చేశాడు. పరిస్థితులను అర్థం చేసుకుని ఫినిషర్‌గా రాణించగలనని అన్నాడు.
"టీ20 ప్రపంచకప్‌కు ఏడాది సమయం ఉంది. దేశవాళీ క్రికెట్‌లో రాణించి టీమిండియాలో చోటు సంపాదిస్తా. ఎందుకంటే కఠిన పరిస్థితులను అర్థం చేసుకుని మ్యాచ్‌ను ముగించే మంచి ఫినిషర్ కోసం భారత్ ఎదురుచూస్తుంది. నేను ఆ స్థానానికి సరిపోతానని భావిస్తున్నా. ఇటీవల జరిగిన ప్రపంచకప్‌లో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాను. ఫలితంగా ప్రస్తుత భారత జట్టులో నాకు చోటు దక్కలేదు. ధోనీ ఎన్నో ఏళ్లు గొప్ప ఫినిషర్‌గా సేవలు అందించాడు. అతడి స్థానాన్ని నేను భర్తీ చేయగలను. కోల్‌కతా నైట్ రైడర్స్, తమిళనాడు జట్లకు ఆడిన గొప్ప ఇన్నింగ్స్‌లను టీమిండియాకు కూడా ఆడగలనని నమ్ముతున్నా. టీ20 ప్రపంచకప్‌లో భారత జెర్సీ ధరించాలని ఉంది."
- దినేశ్ కార్తీక్, వికెట్ కీపర్.
2018లో జరిగిన నిదహాస్ ముక్కోణపు సిరీస్ ఫైనల్లో కార్తీక్ ఆఖరి బంతికి సిక్సర్ బాది భారత్‌ను గెలిపించాడు. ఈ కారణంగా అతడు మంచి ఫినిషర్‌గా గుర్తింపు పొందాడు. కానీ, ఇటీవల ఇంగ్లాండ్‌లో జరిగిన ప్రపంచకప్‌లో 8, 6 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీస్‌లో కష్టాల్లో పడిన జట్టును కార్తీక్ ఆదుకోలేకపోయాడు. భారత్ తరఫున 26 టెస్టులు, 94 వన్డేలు, 32 టీ20లు ఆడాడీ ఆటగాడు.
ఇదీ చూడండి : సర్ఫరాజ్ తొలగింపుపై మాజీల మండిపాటు