టీమ్ఇండియా సారథి కోహ్లి.. ఆస్ట్రేలియాతో జరిగే తొలి టెస్ట్ తర్వాత పితృత్వ సెలవులపై స్వదేశానికి తిరిగి రానుండటం చర్చనీయాంశమైంది. బోర్డు.. కోహ్లీకి అనుమతివ్వడం ఓ ఆసక్తికర చర్చకు దారి తీసింది. 'ఇప్పుడైతే ఇలా అడగ్గానే ఇస్తున్నారు కానీ.. ఒకప్పుడు సునీల్ గావస్కర్ పితృత్వ సెలవులు అడిగినా బీసీసీఐ ఇవ్వలేద'ని ప్రస్తుతం జోరుగా ప్రచారం సాగుతోంది.
తాజాగా దీనిపై గావస్కర్ స్పష్టతనిచ్చాడు. 'ఈ వార్తలో పూర్తిగా నిజం లేదు. కానీ నేను పితృత్వ సెలవులు అడగలేదు. 1975-76లో నేను న్యూజిలాండ్, వెస్టిండీస్ పర్యటన కోసం బయలుదేరినప్పుడు నా భార్య బిడ్డకు జన్మనివ్వనుందన్న విషయం నాకు తెలుసు. అయినా నేను ఆడటానికే ప్రాధాన్యం ఇచ్చాను. ఎందుకంటే నా భార్య నేను ఆడేలా ప్రోత్సాహించింది. అయితే న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టెస్టులో గాయపడ్డాను. కొన్ని వారాల విశ్రాంతి అవసరం అని డాక్టర్లు చెప్పారు. వెస్టిండీస్ పర్యటనకు వెళ్లడానికి మూడు వారాల సమయం ఉండటం వల్ల ఆ లోపు స్వదేశానికి వెళ్లి, తొలి టెస్ట్‌కు ముందే నేరుగా విండీస్‌లో జట్టుతో చేరుతానని అనుమతి అడిగాను. అయితే అప్పటి టీమ్ మేనేజర్ పాలీ ఉమ్రిగర్ అందుకు ఒప్పుకోలేదు. దీంతో గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోయినా తొలి టెస్ట్‌లో ఆడాను" అని గావస్కర్ వివరించాడు.
ప్రస్తుతం ఆసీస్‌తో జరిగిన రెండు వన్డేల్లోనూ టీమ్ఇండియా ఓటమిపాలై సిరీస్‌ను కోల్పోయింది. డిసెంబరు 2న ఇరు జట్లు మూడో వన్డేలో తలపడనున్నాయి.
ఇదీ చూడండి : భారత్-ఆస్ట్రేలియా వన్డేలో 'లవ్ ప్రపోజల్'