ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ కెప్టెన్-కోచ్ కాంబినేషన్... మహేంద్ర సింగ్ ధోనీ-స్టీఫెన్ ఫ్లెమింగ్లదని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వాట్సన్ అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో వీరిద్దరూ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం ఇదే జట్టు తరఫున ఆడుతున్నాడు వాట్సన్.
"చెన్నై సూపర్ కింగ్స్‌తో నా అనుబంధం చాలా ప్రత్యేకం. ఐపీఎల్లో సీఎస్కే విజయవంతమవడంలో ఎలాంటి రహస్యం లేదు. అది కేవలం ఫ్లెమింగ్-ధోనీ కాంబినేషన్ వల్లే సాధ్యమైంది. జట్టును సమన్వయంతో నడపడం, ఆటగాళ్ల ప్రతిభను వెలికి తీయడంలో వీరిద్దరిది కీలకపాత్ర".
- షేన్ వాట్సన్, ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు
ధోనీ-ఫ్లెమింగ్ కాంబినేషన్ వల్లే సీఎస్కే.. కచ్చితమైన ప్రణాళికలతో ముందడుగు వేస్తుందన్నాడు వాట్సన్.
"అత్యధిక లీగ్ మ్యాచ్‌లు సీఎస్కే తరఫునే ఆడాను. కచ్చితమైన మార్గంలో విజయాలు సాధిస్తూ ముందుకు సాగుతోంది సీఎస్కే. ఆ జట్టుకున్న సరైన ప్రణాళికే దీనికి కారణం. ధోనీ-ఫ్లెమింగ్‌ల పాత్రే కీలకం. ప్రపంచంలోనే ఆ ఇద్దరిది అత్యుత్తమ కెప్టెన్-కోచ్ కాంబినేషన్ అని బలంగా నమ్ముతాను".
-వాట్సన్, ఆసీస్ మాజీ ఆటగాడు
2018 ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో 57 బంతుల్లో 117 పరుగులు చేసిన వాట్సన్.. సీఎస్కే కప్పు గెలుచుకోవడంలో కీలకపాత్ర పోషించాడు.
ఇవీ చూడండి.. కోచ్‌గా మెక్కల్లమ్ కొత్త రోల్