యూఏఈ వేదికగా గతేడాది జరిగిన ఐపీఎల్‌కు సంబంధించిన ఓ ఘటన కలకలం సృష్టిస్తోంది. దిల్లీకి చెందిన ఓ మహిళ సోషల్‌మీడియాలో ఓ క్రికెటర్‌ను ట్రాప్ చేసి.. మ్యాచ్‌కు సంబంధించిన అంతర్గత విషయాలను రాబట్టాలని ప్రయత్నించిందని సమాచారం. ఆ వివరాలతో బెట్టింగ్ నిర్వహించాలని ఆమె భావించినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని సదరు క్రికెటర్ బీసీసీఐ అవినీతి విభాగానికి ఫిర్యాదు చేశాడు. దీనిపై దర్యాప్తు చేపట్టిన అజిత్ సింగ్ నేతృత్వంలోని అవినీతి విభాగం ఎలాంటి కీలక సమాచారం బయటపడలేదని స్పష్టం చేసింది.
ఏం జరిగిందంటే?
దిల్లీలో నర్సుగా పనిచేస్తున్న ఓ మహిళ.. తాను పెద్ద డాక్టర్ అని క్రికెటర్‌తో ఐపీఎల్‌కు ముందు సోషల్‌మీడియాలో పరిచయం పెంచుకుంది. సదరు ఆటగాడ్ని మ్యాచ్‌కు సంబంధించిన రహస్యాలను తనతో పంచుకోమని, మ్యాచ్‌కు ముందు తుదిజట్టు వివరాలను తెలియజేయాలంటూ అతడిని అడిగినట్లు సమాచారం. అంతర్గత విషయాలను బయట పెట్టడం నేరమని ఆమెకు చెప్పిన క్రికెటర్.. బీసీసీఐ అవినీతి నిరోధక విభాగానికి ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన అవినీతి నిరోధక విభాగ అధ్యక్షుడు అజిత్ సింగ్ దర్యాప్తునకు ఆదేశించాడు. విచారణలో సదరు ఆటగాడు మ్యాచ్‌కు సంబంధించిన ఎలాంటి సమాచారాన్ని బయటపెట్టినట్లు ఆధారాలు లభించకపోవడం వల్ల ఆ కేసును అక్కడే మూసేసినట్లు తెలుస్తోంది.
"ఐపీఎల్ 2020 జరుగుతున్న సమయంలో సదరు ఆటగాడు మాకు దీనిపై సమాచారాన్ని ఇచ్చాడు. అతడి ఫిర్యాదు మేరకు మేము దర్యాప్తు ప్రారంభించాం. అయితే, జట్టులోని అంతర్గత వివరాలను కోరిన మహిళకు ఏ బెట్టింగ్ సిండికేట్‌తోనూ సంబంధాలు లేవని నిర్ధారించుకున్నాం. అందుకే ఆ కేసును అప్పుడే మూసేశాం" అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
ఇదీ చూడండి: సిడ్నీ టెస్టు కోసం టీమ్ఇండియా ముమ్మర సాధన