ఐపీఎల్ 13వ సీజన్ నుంచి ఇంగ్లాండ్ పేసర్ క్రిస్‌వోక్స్ తప్పుకోనున్నట్లు తెలుస్తోంది. గత డిసెంబర్ 19న జరిగిన ఐపీఎల్ వేలంలో.. దిల్లీ క్యాపిటల్స్ ఇతడిని రూ.1.50 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే జూన్ 4 నుంచి ఇంగ్లాండ్.. రెండు టెస్టు సిరీసుల్లో ఆరు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. తొలుత శ్రీలంకతో, తర్వాత వెస్టిండీస్‌తో మూడేసి మ్యాచ్‌లు ఆడనుంది. ఈ నేపథ్యంలోనే ఆ సిరీసుల్లో రాణించేందుకు వోక్స్, ఐపీఎల్ నుంచి తప్పుకొనున్నట్లు సమాచారం.
ఇదివరకు కోల్‌కతా నైట్‌రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులకు ఆడిన ఈ ఇంగ్లాండ్ పేసర్.. 2017లో 17 వికెట్లు తీశాడు. 2018లో ఎక్కువ పరుగులివ్వడం వల్ల అతడు 5 మ్యాచ్‌లకే పరిమితమయ్యాడు.
ఇప్పటికే గాయాల బెడద
దిల్లీ తుది జట్టులో వోక్స్‌కు చోటు దక్కుతుందా? లేదా అనేది సందిగ్ధంలో ఉంటే.. ఇప్పటికే ఆ జట్టు పేసర్లు ఇషాంత్ శర్మ, రబాడ గాయాలతో ఇబ్బంది పడుతున్నారు. ఫలితంగా టోర్నీ ఆరంభంలో కొన్ని మ్యాచ్‌లు ఆడే అవకాశం లేదనిపిస్తోంది.
ఈనెల 29న జరిగే ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ తలపడనున్నాయి. తర్వాతి రోజు దిల్లీ క్యాపిటల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో తలపడనుంది.