ఐపీఎల్ మినీ వేలంలో బ్యాకప్ ఆటగాళ్లను కొనుగోలు చేస్తామని దిల్లీ క్యాపిటల్స్ సహాయ కోచ్ మహ్మద్ కైఫ్ అన్నాడు. త్వరలో జరిగే ఐపీఎల్ కోసం తగిన బెంచ్ బలం పెంచుకోవడమే తమ లక్ష్యమని పేర్కొన్నాడు. ఇప్పటికిప్పుడు మ్యాచ్ ఆడేందుకు 11 మంది ఆటగాళ్లు సిద్ధంగా ఉన్నారని, మరో సహాయ కోచ్ ప్రవీణ్ ఆమ్రె వెల్లడించాడు. గురువారం ఆటగాళ్ల వేలం జరగనుంది.
గతేడాది ఐపీఎల్‌లో దిల్లీ రన్నరప్‌గా నిలిచింది. మరోసారి మెరుగైన ప్రదర్శన చేయాలనుకుంటున్న ఆ ఫ్రాంచైజీ రిజర్వ్ బెంచ్‌ను మరింత బలోపేతం చేయాలని భావిస్తోంది. గతేడాది సరైన రిజర్వ్ ఆటగాళ్లు లేకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంది.
"మేం కొందరు ఆటగాళ్లను విడుదల చేశాం. అందుకే ఆ లోటు పూడ్చుకోవాలని అనుకుంటున్నాం. వేలంలో ఫ్లెక్సిబిలిటీకి ప్రాధాన్యం ఇస్తాం. వేలం ముందు చాలా ప్రణాళికలు ఉంటాయి. కానీ ఒక్కోసారి వేలం జరుగుతుండగానే ప్రణాళికలు మారిపోతుంటాయి. అప్పటికప్పుడు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. మా కీలక ఆటగాళ్లు క్రమం తప్పకుండా ఆడుతున్నారు. ఎలాంటి ఫిట్‌నెస్ ఇబ్బందులూ లేవు. అందుకే మేం రిజర్వ్ ఆటగాళ్లను తీసుకొనేందుకు ప్రయత్నిస్తాం" అని కైఫ్ అన్నాడు.
ప్రస్తుత జట్టు గురించి మాట్లాడుతూ "నిజం చెప్పాలంటే రేపే మ్యాచ్ ఆడాల్సి ఉంటుందని చెప్పినా మేం సిద్ధంగా ఉన్నాం. మా తుది పదకొండు మంది సిద్ధంగా ఉన్నారు. అది విజయవంతమైన ప్రణాళికలు, కీలక ఆటగాళ్లను అట్టిపెట్టుకొనే ఇతర జట్లను చూసి నేర్చుకొన్న ఫలితమే." అని మరో సహాయ కోచ్ ప్రవీణ్ ఆమ్రె వెల్లడించాడు.
ఇదీ చదవండి: ఐపీఎల్ వేలం: ఈ బౌలర్లు, ఆల్రౌండర్లపైనే దృష్టి!