పాకిస్థాన్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా పట్టుబిగిస్తోంది. అడిలైడ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ మొదటి రోజు ముగిసే సమయానికి వికెట్ నష్టపోయి 302 పరుగులు చేసింది ఆతిథ్య జట్టు. తొలి టెస్టులో శతకాలతో అదరగొట్టిన డేవిడ్ వార్నర్, మార్నస్ లబుషేన్ మరోసారి సెంచరీలతో చెలరేగారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. జట్టు స్కోరు 8 పరుగులప్పుడే ఓపెనర్ జోయ్ బర్న్స్ (4)ను ఔట్ చేశాడు షాహిన్ అఫ్రిదీ. అయితే అనంతరం క్రీజులోకి వచ్చిన లబుషేన్ సాయంతో డేవిడ్ వార్నర్ స్కోరు బోర్డు ముందుకు నడిపించాడు.
వార్నర్ 23వ శతకం..
పాక్ బౌలర్లు అవకాశమివ్వకుండా ఇరువురు ఆటగాళ్లు ఆకట్టుకున్నారు. చెత్తబంతుల్ని బౌండరీకు తరలిస్తూ ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించారు. ముఖ్యంగా వార్నర్.. ధాటిగా ఆడుతూ సెంచరీతో కదం తొక్కాడు. 228 బంతుల్లో 166 పరుగులు చేసి బ్యాటింగ్ కొనసాగిస్తున్నాడు. ఇందులో 19 ఫోర్లు ఉన్నాయి. టెస్టుల్లో వార్నర్‌కిది 23వ శతకం.
లబుషేన్ మరోసారి..
తొలి టెస్టులో 185 పరుగులతో విజృంభించిన మర్నస్ లబుషేన్ రెండో టెస్టులోనూ బ్యాట్ ఝుళిపించాడు. వార్నర్‌తో కలిసి భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 205 బంతుల్లో 126 పరుగులు చేసి కెరీర్లో రెండో సెంచరీని నమోదు చేశాడు. ఇందులో 17 ఫోర్లు ఉన్నాయి. నిలకడగా ఆడుతూ పాక్ బౌలర్లు సహనాన్ని పరీక్షించాడు లబుషేన్.
ఈ మ్యాచ్ రికార్డులు..
పాక్ - ఆసీస్‌కు మధ్య టెస్టుల్లో అత్యుత్తమ రెండో వికెట్ భాగస్వామ్యం నమోదుచేశారు వార్నర్, లబుషేన్. 294 పరుగులు చేసిందీ జోడీ.
టెస్టుల్లో వార్నర్‌కిది మూడో అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు. అంతకుముందు 253(న్యూజీలాండ్), 180(భారత్) పరుగులు చేశాడు.
ఇదీ చదవండి: ఏకైక టెస్టులో వెస్టిండీస్‌దే విజయం