ఇక నుంచి క్రికెట్, కొవిడ్ సహజీవనం చేయాల్సి ఉంటుందని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సీఈఓ వసీమ్ ఖాన్ అన్నారు. క్రీడల పునఃప్రారంభానికి ముందే ఆటగాళ్లలో కరోనా కేసులు ఉన్నప్పటికీ.. పీసీబీ ఇంగ్లాడ్ పర్యటనను ముందుగానే ఆటగాళ్లను తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు ఖాన్ తెలిపారు. తాజాగా స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. పలు విషయాలు పంచుకున్నారు.
"చాలా మంది ఆటగాళ్లకు కరోనా పరీక్షల్లో పాజిటివ్‌గా తేలడం వల్ల బోర్డు ఒత్తిడికి గురైంది. అందువల్ల ఇటువంటి పరిస్థితుల్లో క్రికెట్ జట్టును ఇంగ్లాండ్‌కు పంపించడం సవాలుతో కూడుకున్న పని. అయితే ఈ పర్యటనను కచ్చితంగా ముందుకు తీసుకెళ్లాలని ప్రణాళిక రచించాం. ఎందుకంటే క్రికెట్ పునరుద్ధరణలో పాక్ బోర్డు కీలక పాత్ర పోషించాలని అనుకుంటున్నాం. ఈ మ్యాచ్‌లను కొనసాగించడం ఎంతో అవసరం."
వసీమ్ ఖాన్, పీసీబీ సీఈఓ
ఈ మహమ్మారి మధ్య అంతర్జాతీయ క్రికెట్ తిరిగి ప్రారంభమయ్యేలా చూడటం మినహా.. ఇంగ్లాండ్ పర్యటన వెనక వేరే కారణం లేదని ఖాన్ ఉద్ఘాటించారు.
గత నెలలో 10 మంది పాకిస్థాన్ ఆటగాళ్లు కరోనా బారిన పడిన నేపథ్యంలో.. ఇంగ్లాండ్ సిరీస్ కోసం తమ జట్టును పంపాలా వద్దా అనే సందిగ్ధతలో పడింది పీసీబీ. ఇటీవలే రెండో రౌండ్లో నిర్వహించిన పరీక్షల్లో నెగిటివ్‌గా తేలిన కొంత మంది ఆటగాళ్లు ఇంగ్లాండ్ చేరారు.
మరోవైపు, ఆగస్టు 5 నుంచి ఇంగ్లాడ్ జట్టుతో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది పాక్. అనంతరం ఇరు జట్ల మధ్య టీ 20 మ్యాచ్‌లూ జరగనున్నాయి.