ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ను యూఏఈలో నిర్వహించుకొనేందుకు బీసీసీఐకి కేంద్రం పచ్చజెండా ఊపింది. మరికొన్ని రోజుల్లో లిఖిత పూర్వకంగా అనుమతి రానుంది. ప్రభుత్వం నుంచి మౌఖిక ఆదేశాలు రావడం వల్ల ఫ్రాంచైజీలు మిగతా పనుల్లో నిమగ్నమయ్యాయి. నిబంధనల ప్రకారం ఆటగాళ్లు, సిబ్బందిని క్వారంటైన్‌కు పంపించేందుకు సమాయత్తం అవుతున్నాయి.
బీసీసీఐ ఆదేశాల ప్రకారం ఎక్కువ ఫ్రాంచైజీలు ఆగస్టు 20 తర్వాతే దుబాయ్‌కు బయల్దేరనున్నాయి. చెన్నై సూపర్‌కింగ్స్ బృందం 22న వెళ్లనుందని తెలిసింది. లీగ్‌లో అత్యంత విజయవంతమైన ముంబయి ఇండియన్స్ తన సొంత శిబిరంలోనే భారతీయ ఆటగాళ్లను క్వారంటైన్ చేస్తోంది. మరికొన్ని జట్లు దిల్లీ, ముంబయి, చెన్నై, బెంగళూరు నగరాల్లో కొవిడ్-19 పరీక్షలు చేయించి యూఏఈకి తీసుకెళ్లాలని నిర్ణయించాయి.
ఫ్యామిలీల సంగతేంటి?.
యూఏఈకి వెళ్లే ముందు 24 గంటల వ్యవధిలో రెండు సార్లు ఆర్‌టీ పీసీఆర్ పరీక్షలు చేయించాలని బీసీసీఐ చెప్పగా ఫ్రాంచైజీలు నాలుగు సార్లు చేస్తామని తెలిపాయి. కఠిన నిబంధనలు, భౌతిక దూరం పాటిస్తూ బయో బుడగ దాటకుండా ఉంటే కుటుంబ సభ్యులకు అనుమతి ఇస్తామని కొన్ని ఫ్రాంచైజీలు అంటున్నాయి. అయితే భద్రత, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని కుటుంబ సభ్యులు వద్దని కొందరు ఆటగాళ్లు చెబుతున్నారని తెలిసింది. చిన్నారులతో కష్టమని వారు భావిస్తున్నట్టు సమాచారం.
బస హోటళ్లలో కాదు..
చాలా ఫ్రాంచైజీలు యూఏఈ హోటళ్లలో ఉంటే ప్రమాదమని భావించి రిసార్టులు, అపార్టుమెంట్లు బుక్ చేస్తున్నాయి. వంటవాళ్ల నుంచి అన్ని పనులకు అవసరమైన సిబ్బందిని ఇక్కడి నుంచే తీసుకెళ్తారని తెలుస్తోంది. ప్రస్తుతం ఒక్కో జట్టుకు 24 మంది ఆటగాళ్లకు బీసీసీఐ అనుమతి ఇచ్చింది. సిబ్బంది సంఖ్యపై పరిమితి విధించలేదు. ఇతర అవసరాలు, వైద్య సిబ్బంది సహా మొత్తం కలిపి ఒక్కో ఫ్రాంచైజీ నుంచి 60 మంది వరకు ఉంటారని తెలుస్తోంది.