విండీస్ దిగ్గజ ఆటగాడు సెసిల్ రైట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. మరో రెండు వారాల్లో 85వ పడిలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఆటకు దూరం అవుతున్నట్లు ప్రకటించాడీ సీనియర్ క్రికెటర్. అయితే తన ఫిట్నెస్ వల్లే ఇన్నేళ్లు క్రికెట్లో కొనసాగానని చెప్పుకొచ్చాడు.
" ఇంత సుదీర్ఘ కాలం క్రికెట్లో కొనసాగడానికి కారణాలేంటో నాకు తెలుసు. అవేంటో మీకు చెప్పను. నాకు నచ్చిన ప్రతి ఆహారాన్ని తినేవాడిని. ఎక్కువగా తాగను. నేనెప్పుడు ఫిట్‌గా ఉంటాను. ఈ మధ్య నా వయసును సాకుగా చూపి సాధనకు వెళ్లలేకపోతున్నాను. ఇంట్లో కూర్చొని టీవీ చూడటం నాకిష్టం ఉండదు. బయటకెళ్లి ఏదో ఓ పని చేయడం ఇష్టం".
-- సెసిల్ రైట్, వెస్టిండీస్ మాజీ క్రికెటర్
ఫాస్ట్ బౌలరైన రైట్...మొదట బార్బడోస్‌తో మ్యాచ్‌లో జమైకాకు ప్రాతినిధ్యం వహించాడు. గ్యారీ సోబర్స్‌కు ప్రత్యర్థిగా తలపడ్డాడు. 1959లో ఇంగ్లాండ్ వెళ్లి సెంట్రల్ లాంక్షైర్కు ఆడాడు. ఎనిద్‌ను పెళ్లాడి అక్కడే స్థిరపడ్డాడు.
రైట్ తన 60 ఏళ్లకు పైగా కెరీర్‌లో 7వేలకు పైగా వికెట్లు తీశాడు. ఒకానొక దశలో ఐదు సీజన్లలో 538 వికెట్లు తీసి సంచలనం సృష్టించాడు. అంటే దాదాపు 27 బంతులకు ఓ వికెట్ పడగొట్టాడు.సెప్టెంబర్ 7న పెన్నీ లీగ్‌లో అప్పర్‌మిల్ తరఫున స్ప్రింగ్‌హెడ్‌పై మ్యాచ్ ఆడి ఆయన వీడ్కోలు తీసుకోనున్నాడు.