వెస్టిండీస్ పర్యటనను దిగ్విజయంగా ముగించిన టీమిండియా మరో కీలక సమరానికి సిద్ధమైంది. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో నేటి నుంచి జరుగనున్న టీ-20 సిరీస్‌లో తలపడనుంది. 2015లో సఫారీల చేతిలో సొంతగడ్డపై ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది కోహ్లీసేన. ధర్మశాల వేదికగా ఇరుజట్ల మధ్య రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
2015లో భారత్‌లో పర్యటించిన దక్షిణాఫ్రికా 2-0 తేడాతో నెగ్గి సిరీస్ కైవసం చేసుకుంది. అయితే మొత్తంగా చూసుకుంటే 2008 నుంచి ఇప్పటివరకు టీ-20 సిరీస్‌ల్లో 13-8 తేడాతో ముందంజలో ఉంది టీమిండియా.
ఆమ్లా, డుప్లెసిస్ లేకుండానే..
క్వింటన్ డికాక్ సారథ్యంలో భారత్‌తో అమితుమీ తేల్చుకోనుంది ప్రొటీస్ జట్టు. బౌలింగ్‌లో కగిసో రబాడాతో భారత్‌కు ఇబ్బంది తప్పేలా లేదు. ఫెలుక్వాయో, ఆన్రిచ్ నోర్త్జే లాంటి బౌలర్లు నిలకడగా రాణిస్తున్నారు. బ్యాటింగ్ విభాగంలో డేవిడ్ మిల్లర్, డికాక్, డసెన్ లాంటి టీ-20 స్పెషలిస్టులు టీమిండియాకు సవాల్ విసిరే అవకాశముంది.
అయితే ఫాఫ్ డుప్లెసిస్, హషీమ్ ఆమ్లా లాంటి అనుభవజ్ఞుల గైర్హాజరుతో బరిలో దిగుతున్న దక్షిణాఫ్రికాలో యువ క్రికెటర్లు తమను తాము నిరూపించుకోవాల్సి ఉంది. ఇప్పటికే ప్రపంచకప్‌లో విఫలమైన ప్రొటీస్ జట్టు భారత్‌పై నెగ్గాలని తహతహలాడుతుంది.
నాలుగులో ఎవరో..?
రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీతో భారత టాపార్డర్ దుర్భేద్యంగా ఉంది. మిడిల్ ఆర్డర్లో శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్య, పంత్, జడేజా నిలకడగా ఆడుతున్నారు. నాలుగో స్థానంలో మనీశ్ పాండే, శ్రేయస్ అయ్యర్ మధ్య పోటీ నెలకొంది. వీరిద్దరిలో ఒకరికి తుది జట్టులో చోటు దక్కనుంది.
బుమ్రాకు విశ్రాంతినిచ్చిన నేపథ్యంలో ఖలీల్ అహ్మద్, నవదీప్ సైనీ, దీపక్ చాహర్ లాంటి యువ పేసర్లు బౌలింగ్ విభాగాన్ని నడిపించనున్నారు. ఆల్‌రౌండర్ల జాబితాలో పాండ్య సోదరులిద్దరిలో ఒకరిని తీసుకుంటారో.. లేదా ఇద్దరికీ అవకాశం కల్పిస్తారో చూడాలి.
రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ స్పిన్ భారాన్ని మోయనున్నారు. రాజస్థాన్ లెగ్ స్పినర్ రాహుల్ చాహర్‌కు అవకాశమిస్తారో లేదో చూడాలి. వచ్చే ఏడాది జరగనున్న టీ 20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకొని.. ఎక్కువగా యువ క్రికెటర్లకు అవకాశం కల్పించింది.
3-0 తేడాతో వెస్టిండీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన కోహ్లీసేన సఫారీలపైనా అదే జోరు కొనసాగించాలనుకుంటోంది. నేడు దక్షిణాఫ్రికాతో జరగనున్న తొలి టీ-20లో నెగ్గి శుభారంభం చేయాలని భావిస్తోంది టీమిండియా.
ఇదీ చదవండి: హైదరాబాద్‌కు కెప్టెన్‌గా అంబటి రాయుడు