'మ్యాచ్‌లు గెలవాలంటే క్యాచ్‌లు కీలకం' అనేది సన్‌రైజర్స్ హైదరాబాద్ x దిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌లో మరోసారి రుజువైంది. ఆదివారం జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో ఫీల్డింగ్ తప్పిదాల వల్ల సన్‌రైజర్స్ భారీ మూల్యం చెల్లించుకుంది. అందుకే మ్యాచ్ అనంతరం క్యాచ్‌లపై తన అభిప్రాయం చెప్పాడు హైదరాబాద్ జట్టు సారథి డేవిడ్ వార్నర్.
" ప్రారంభంలో మాకు ఎవరూ అవకాశమివ్వలేదు. ముంబయి, దిల్లీ, ఆర్సీబీ వంటి గట్టిజట్లకి పోటీ ఇచ్చి రేసులోకి వచ్చాం. అయితే ఈ రోజు మేము ఉన్న స్థానం పట్ల మాకు గర్వంగా ఉంది. ఈ ఐపీఎల్లో నటరాజన్ వంటి కొత్త టాలెంట్‌ను గుర్తించాం. అతడు నిజంగా అత్యుత్తమం. రషీద్ చాలా అద్భుతంగా ఆడాడు. మనీశ్ మూడో స్థానంలో రాణించాడు. ఆల్‌రౌండ్‌గా చూసుకుంటే మా ప్రదర్శన బాగుంది. భారత్ నుంచే మాకు మద్దతుగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు. క్యాచ్‌లు పట్టకపోతే మ్యాచ్‌లు గెలవలేం. ఫీల్డింగ్‌లో మా వైఖరి సరిగ్గా లేకపోవడం వల్లే ఈ టోర్నీలో ఓడిపోయాం. తర్వాతి సీజన్లో మరింతగా రాణిస్తాం. సాహా, భువీ వంటి కీలక ఆటగాళ్లు టోర్నీ మధ్యలో వైదొలగడం విచారకరం. అయితే మిగతా అందరూ ప్రతిభ చూపారు. వారి వల్లే ఈరోజు ఇక్కడ వరకు వచ్చాం. మా అభిమానులు చాలా నమ్మకంగా ఉన్నారు. కేబుల్ బ్రిడ్జిపై లైట్లు వెలిగించిన ఫొటోలు చూశాను. హైదరాబాద్ నాకు రెండో ఇళ్లులాంటిది. ఫ్రాంఛైజీ యజమానులు నా కుటుంబసభ్యులు. వచ్చే ఏడాది ఐపీఎల్‌ను భారత్‌లోనే ఆడతామని ఆశిస్తున్నాం. అక్కడ మంచి ప్రదర్శన చేస్తాం"
-- డేవిడ్ వార్నర్, సన్‌రైజర్స్ కెప్టెన్.
ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ను ఓడించి ఐపీఎల్ ఫైనల్‌కు దూసుకెళ్లింది దిల్లీ క్యాపిటల్స్. స్టాయినిస్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టడం వల్ల ఆదివారం జరిగిన క్వాలిఫయర్-2లో 17 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై గెలిచింది దిల్లీ జట్టు. శిఖర్ ధావన్ (78; 50 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు), హెట్‌మయర్ (42 నాటౌట్; 22 బంతుల్లో 4ఫోర్లు, 1సిక్సర్), స్టాయినిస్ (38; 27 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్) చెలరేగడం వల్ల.. మొదట బ్యాటింగ్ చేసిన దిల్లీ 3 వికెట్లకు 189 పరుగులు సాధించింది.
స్టాయినిస్ (3/26), రబాడ (4/29) విజృంభించగా.. ఛేదనలో సన్‌రైజర్స్ 8 వికెట్లకు 172 పరుగులే చేయగలిగింది. సమద్ (33; 16 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు)తో కలిసి విలియమ్సన్ (67; 45 బంతుల్లో 5ఫోర్లు, 4సిక్సర్లు) జట్టును గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. స్టాయినిస్‌కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లభించింది. ఐపీఎల్-13 ఫైనల్ మంగళవారం జరుగుతుంది. దుబాయ్ వేదికగా దిల్లీxముంబయి ఈ టైటిల్ పోరులో తలపడనున్నాయి.