ఇంగ్లాండ్‌తో జరగనున్న పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీస్‌కు టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా దూరం కానున్నట్లు సమాచారం. పనిభారాన్ని తగ్గించే యోచనలో బుమ్రాకు విశ్రాంతినివ్వాలని భావిస్తున్నారని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. మార్చిలో ఇంగ్లాండ్‌తో భారత్ అయిదు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది.
"ఆస్ట్రేలియా పర్యటన నుంచి ఇప్పటివరకు బుమ్రా దాదాపు 180 ఓవర్లు బౌలింగ్ వేశాడు. నాలుగు టెస్టుల్లో 150 ఓవర్ల వరకు బంతులు విసిరాడు. మైదానంలో అతడు ఎన్నో గంటలు గడిపాడు. ఈ నేపథ్యంలో మోతెరాలో రెండు టెస్టుల అనంతరం అతడికి వైట్‌బాల్ క్రికెట్‌లో విశ్రాంతి ఇవ్వాలి. మరోవైపు భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ తిరిగి జట్టులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాళ్లతో పాటు నటరాజన్, సైనీ కూడా వైట్‌బాల్ జట్టులో ఉంటారు" అని బీసీసీఐ అధికారి అన్నారు.
గత ఐపీఎల్ సీజన్, ఆస్ట్రేలియా పర్యటన, ప్రస్తుత ఇంగ్లాండ్ టెస్టు సిరీస్‌లో రాణిస్తున్న రవిచంద్రన్ అశ్విన్ పరిమిత ఓవర్ల జట్టులోకి వచ్చే అవకాశాలూ లేకపోలేదని తెలిపారు. "వన్డే, టీ20 ఫార్మాట్లలో చాహల్ స్లోబౌలర్‌గా ఉంటాడు. అయితే జడేజా అప్పటికీ కోలుకోకపోతే అశ్విన్‌కు అవకాశం ఇవ్వడం చెడ్డ ఆలోచనేమీ కాదు. ఇక వికెట్‌కీపర్‌గా కేఎల్ రాహుల్ మొదటి ఎంపిక. పంత్ కూడా ఫామ్‌లో ఉన్నాడు. అయితే సంజు శాంసన్‌కు బదులుగా సూర్యకుమార్ యాదవ్ ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి" అని బీసీసీఐ అధికారి పేర్కొన్నారు.
గాయాల కారణంగా భువీ, షమీ జట్టుకు దూరమవ్వగా.. ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న సూర్యకుమార్ నిలకడగా పరుగులు సాధిస్తున్నాడు.
ఇదీ చూడండి: అంపైర్‌తో గొడవ.. కోహ్లీపై ఓ మ్యాచ్ నిషేధం!