టెస్టుల్లో అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు వెస్టిండీస్ దిగ్గజం బ్రియన్ లారా(400) పేరిట ఉంది. ఇటీవల పాక్‌తో టెస్టులో ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్(335*) ఆ ఘనత అందుకునేలా కనిపించినప్పటికీ కెప్టెన్ పైన్ డిక్లేర్ చేయడం వల్ల ఆ రికార్డు బ్రేక్ చేయలేకపోయాడు. ఈ అంశంపై తాజాగా లారా స్పందించాడు. తన రికార్డును విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అందుకుంటారని అభిప్రాయపడ్డాడు.
"నా రికార్డును డేవిడ్ వార్నర్ అందుకునేలా కనిపించాడు. నేనూ అలాగే అనుకున్నా. అయితే పైన్ నిర్ణయాన్ని తప్పుపట్టడానికి లేదు. ఫలితంగా పాక్ జట్టులో 6 వికెట్లు తీయగలిగారు. వార్నర్, గేల్, ఇంజిమామ్, జయసూర్య, హేడెన్ లాంటి ఎటాకింగ్ ప్లేయర్లు ఎవరైనా నా రికార్డు బద్దలు కోట్టే అవకాశముంది" - బ్రియన్ లారా, వెస్టిండీస్ మాజీ క్రికెటర్.
అయితే కోహ్లీ, రోహిత్ శర్మ కచ్చితంగా బ్రేక్ చేస్తారనిపిస్తోందని లారా అన్నాడు.
"విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి ఆటగాళ్లు సరిగ్గా ఆడితే రోజు, రోజున్నరలోపే నా రికార్డు కచ్చితంగా బ్రేక్ చేస్తారు. రికార్డులు ఎప్పటికే అలాగే ఉంటాయని నేను అనుకోవడం లేదు" - బ్రియన్ లారా, వెస్టిండీస్ మాజీ క్రికెటర్.
ఇటీవల 1-2 తేడాతో భారత్‌పై టీ20 సిరీస్ కోల్పోయిన విండీస్.. మళ్లీ పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశాడు లారా. వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచకప్‌లో సత్తాచాటుతారని అన్నాడు.
ఇదీ చదవండి: ఈ ఏడాది ఐపీఎల్ వేలంలో చిన్నోడు-పెద్దోడు