షెడ్యూలు ప్రకారం 2021 ఐపీఎల్ నేపథ్యంలో నిర్వహించాల్సిన భారీ వేలాన్ని నిర్వహించరాదని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వేలం ప్రస్తుతం నిరధిక వాయిదాలో ఉంది. ఆటగాళ్లు గాయపడితే లేదా అందుబాటులో లేకపోతే తప్ప ఫ్రాంఛైజీలు దాదాపుగా ఇప్పుడున్న జట్లతోనే 2021 ఐపీఎల్‌లో ఆడే అవకాశముంది.
ఆరు నెలల కన్నా తక్కువే..
ఈ ఏడాది ఐపీఎల్ ముగిసిన తర్వాత వచ్చే ఐపీఎల్ కోసం సిద్ధం కావడానికి బోర్డుకు ఆరు నెలల కన్నా తక్కువ సమయమే ఉంటుంది. వేలం తర్వాత జట్లను పునర్‌నిర్మించుకోవడానికి జట్లకు తగినంత సమయం ఉండదన్న బోర్డు అభిప్రాయంతో ఫ్రాంఛైజీలు కూడా ఏకీభవిస్తున్నాయి. వచ్చే ఏడాది ఐపీఎల్‌ను త్వరగా ఆరంభించాలంటే ఇంగ్లాండ్‌తో సిరీస్‌కు కేటాయించిన సమయాన్ని బోర్డు తగ్గించాల్సి వుంటుంది.
ఈ ఏడాది ఐపీఎల్ యూఏఈ వేదికగా జరగనుంది. సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు టోర్నీ జరగనుంది. అనంతరం వచ్చే ఏడాది మార్చి-ఏప్రిల్‌లో మళ్లీ ఐపీఎల్-2021 నిర్వహించనున్నారు.