జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లోని కోచ్‌ల ఒప్పందాలు పునరుద్ధరించకూడదని బీసీసీఐ నిర్ణయించింది. కరోనా మహమ్మారి కారణంగా ఎన్‌సీఏలో శిక్షణ ఇవ్వట్లేదని.. సమీప భవిష్యత్తులో క్రికెట్ కార్యకలాపాల పునరుద్ధరణ సాధ్యమయ్యే పరిస్థితి లేనందున బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. కోచ్‌ల భర్తీ కోసం కొత్తగా ప్రకటన విడుదల చేస్తామని.. అందరూ దరఖాస్తు చేసుకోవచ్చని బీసీసీఐ అధ్యక్షుడు సౌరబ్ గంగూలీ తెలిపాడు.
"కోచ్‌లతో ఒప్పంద కాలం పూర్తయింది. బీసీసీఐ రాజ్యాంగం ప్రకారం కోచ్‌ల భర్తీ కోసం కొత్తగా ప్రకటన ఇస్తాం. పదవీ కాలం పూర్తయిన కోచ్‌లు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు" అని గంగూలీ పేర్కొన్నాడు.
సుబ్రతో బెనర్జీ, శివ్‌సుందర్ దాస్, హృషికేశ్ కనిత్కర్, రమేశ్ పవార్, మన్సూర్ అలీఖాన్, సితాంషు కోటక్‌లు రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షల జీతానికి ఏడాది కాలం ఒప్పందంతో ఎన్‌సీఏలో కోచ్‌లుగా కొనసాగుతున్నారు. వీరి ఒప్పంద కాలం ఈనెల 30న ముగుస్తుంది. అనంతరం వారి సేవలు అవసరం లేదంటూ ఎన్‌సీఏ చీఫ్ రాహుల్ ద్రవిడ్ ఆ కోచ్‌లకు స్పష్టంచేశాడు. మిగతా కోచ్‌లు రాజీవ్ దత్త, అపూర్వ దేశాయ్, అతుల్ గైక్వాడ్, శుభదీప్ ఘోష్, దిలీప్‌ల సేవలు కూడా వద్దని చెప్పేశాడు.