బీసీసీఐ ముఖ్య కార్యనిర్వహణ అధికారి రాహుల్ జోహ్రి తన పదవికి రాజీనామా చేశారు. ఈమెయిల్ ద్వారా తన రాజీనామా లేఖ పంపగా.. దాన్ని ఆమోదించింది బోర్డు. తాత్కాలిక సీఈవోగా హేమంగ్ అమిన్ను నియమించింది. ఎన్నో ఏళ్లుగా బోర్డులో సేవలందిస్తున్న ఈయనకు పగ్గాలప్పగించడం సంతోషంగా ఉందని తెలిపింది. సోమవారం(జులై 13) నుంచి బాధ్యతలు చేపట్టినట్లు సిబ్బందికి సందేశాలు పంపింది.
ఐపీఎల్ సీఈఓగా పనిచేసిన అమిన్.. గతేడాది మెగాటోర్నీ ప్రారంభోత్సవ వేడుక రద్దు చేసి దానికయ్యే ఖర్చును పుల్వామా ఘటనలో వీరమరణం పొందిన 40 కుటుంబాలకు ఇవ్వాలని ప్రతిపాదించారు. వాటి అమలులోనూ కీలకపాత్ర పోషించారు.
జోహ్రి 2016లో బీసీసీఐకి తొలి సీఈవోగా బాధ్యతలు అందుకున్నారు. సుప్రీంకోర్టు నియమించిన పరిపాలకుల కమిటీ గతేడాది నిష్క్రమించడం, గంగూలీ నేతృత్వంలో కొత్త పాలకవర్గం బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో పదవి నుంచి తప్పుకోవాలని జోహ్రి నిర్ణయించుకున్నారు. అనంతరం కొన్ని నెలల తర్వాత, గతవారం తన రాజీనామాను సమర్పించారు.
ఇదీ చూడండి: ఇంగ్లాండ్ ఆనందానికి.. న్యూజిలాండ్ జట్టు బాధకు ఏడాది