నిబంధనలు అతిక్రమించి... బీసీసీఐ ఆగ్రహానికి లోనైన టీమిండియా క్రికెటర్ దినేశ్ కార్తీక్ క్షమాపణను అంగీకరించింది బోర్డు. ఈ గొడవ ఇంతటితో సద్దుమణిగిందని తెలిపింది.
దినేశ్ కార్తీక్కు నోటీసులు జారీ చేసింది భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ). దీనిపై క్షమించమని కోరుతూ బోర్డుకు లేఖ రాశాడీ ఆటగాడు. తాజాగా అతడి క్షమాపణను అంగీకరించింది బీసీసీఐ.
ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు దినేశ్ కార్తీక్. ఆ ఫ్రాంఛైజీ యజమాని షారుఖ్ ఖాన్.. కరీబియన్ ప్రీమియర్ లీగ్లో ట్రింబాగో నైట్ రైడర్స్ జట్టునూ సొంతం చేసుకున్నాడు.
ఇటీవల ట్రింబాగో డ్రెస్సింగ్ రూమ్లో మెక్కల్లమ్ పక్కన కూర్చుని, ఆ టీమ్ జెర్సీ ధరించి మ్యాచ్ చూశాడు కార్తీక్. బీసీసీఐ నిబంధనల ప్రకారం.. భారత క్రికెటర్లు అనుమతి లేకుండా ఎలాంటి విదేశీ టోర్నీల్లో పాల్గొనకూడదు. అందువల్ల కార్తీక్కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది బీసీసీఐ. వివరణ ఇవ్వాలని వారం గడువు పెట్టింది. ఈ నేపథ్యంలో క్షమించమని కోరుతూ.. బీసీసీఐకి లేఖ రాశాడు డీకే. అందుకు బోర్డు అంగీకరించింది.
ఇవీ చూడండి.. గావస్కర్ సరసన చేరిన స్టీవ్ స్మిత్