దాదాపు నాలుగు నెలల కరోనా లాక్డౌన్ విరామం తర్వాత మైదానంలో ప్రాక్టీసు మొదలెట్టారు బంగ్లాదేశ్ క్రికెటర్లు. జులై 19 నుంచి బంగ్లా క్రికెటర్లకు శిక్షణా శిబిరాన్ని ప్రారంభించింది ఆ దేశ క్రికెట్ బోర్డు. అందులో తొమ్మిది మంది క్రికెటర్లు పాల్గొన్నారు.
నాలుగు స్టేడియాలు
బంగ్లా క్రికెటర్లకు విరివిగా శిక్షణ ప్రారంభించడానికి నాలుగు స్డేడియాలను బంగ్లా క్రికెట్ బోర్డు ఎంపిక చేసింది. ఢాకాలోని షేర్-ఏ-బంగ్లా జాతీయ క్రికెట్ స్టేడియం, చిట్టగాంగ్‌లోని జహూర్ అహ్మద్ చౌదరీ స్టేడియం, సెల్హట్ జాతీయ క్రికెట్ స్డేడియం, షేక్ అబూ నసీర్ స్టేడియాల్లో తొలిదశ శిక్షణా శిబిరాలను ప్రారంభించింది.
ఒక్కరికి మాత్రమే!
ఈ శిక్షణ కోసం ఒకసారి ఒక క్రికెటర్‌ను మాత్రమే స్డేడియం లోపలికి అనుమతిస్తారు. అతనితో ఒక ట్రైనర్ మాత్రమే ఉంటాడు. ఇరువురు భౌతిక దూరాన్ని పాటించాలి. వారికి వేర్వేరు సీట్లు, వాటర్ బాటిల్స్, టాయిలెట్స్ ఏర్పాటు చేస్తారు. ఒక ఆటగాడి ట్రైనింగ్ పూర్తయిన తర్వాత మరో ఆటగాడిని లోపలికి అనుమతిస్తారు. స్టేడియంలోకి బోర్డు అధికారి లేదా సహాయక సిబ్బందిని అనుమతించడం లేదు.
శిక్షణలో పాల్గొన్న బంగ్లా క్రికెటర్లు
ముష్ఫికర్ రహీమ్ (ఢాకా), ఇమ్రుల్ కైస్ (ఢాకా), మహ్మద్ మిథున్ (ఢాకా), షఫీయిల్ ఇస్లాం (ఢాకా) సయీద్ ఖలీద్ (సెల్హాట్), నసూమ్ అహ్మద్ (సెల్హట్), నురల్ హసన్ (ఖుల్నా), మెహది హసన్ (ఖుల్నా), నయీమ్ హసన్ (చిట్టగాంగ్)
వాయిదా పడిన సిరీస్‌లు
బంగ్లాదేశ్ చివరిసారిగా ఈ ఏడాది మార్చిలో జింబాబ్వేతో వన్డే, టీ20 సిరీస్ ఆడింది. జులైలో వెళ్లాల్సిన శ్రీలంక పర్యటన కరోనా కారణంగా వాయిదా పడింది. మరోవైపు న్యూజిలాండ్‌తో జరగాల్సిన రెండు టెస్టులూ వాయిదా పడ్డాయి.