ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుతం ఆస్ట్రేలియా బ్యాటింగ్ లైనప్‌లో స్థిరత్వం లేదని దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందూల్కర్ అన్నారు. జట్టులో చోటుకోసమే వారు ఆడుతున్నట్టు కనిపిస్తోందని పేర్కొన్నారు. రెండో టెస్టులో విజయం అందించిన అజింక్య రహానెపై ప్రశంసల జల్లు కురిపించారు. గిల్, సిరాజ్, బుమ్రా సహా టీమ్‌ఇండియా ఆటగాళ్లందరూ అద్భుతంగా ఆడారని ఆయన పేర్కొన్నారు.
"గత బ్యాటింగ్ లైనప్‌లతో పోలిస్తే ఇప్పటి ఆసీస్ లైనప్‌లో స్థిరత్వం లోపించింది. వారు ప్రత్యేకమైన ఉద్దేశంతో ఆడుతున్నారు. నిలకడ లేదు. ఇప్పుడున్న ఆసీస్‌లో ఆటగాళ్లు ఫామ్‌లో లేరు. జట్టులో చోటు కోసం తపిస్తున్నారు. తొలి టెస్టులో అశ్విన్ భిన్నంగా వదిలిన ఆర్మ్‌బాల్‌కు స్మిత్ ఔటయ్యాడు. రెండో టెస్టులో స్లైడర్ కాని బంతికి వెనుదిరిగాడు. ఆ బంతి బౌన్స్‌తో పాటు టర్న్ అయింది. అశ్విన్ చాలా చక్కగా వల పన్ని ఔట్ చేశాడు. ఇద్దరూ గొప్ప ఆటగాళ్లే. కానీ ఒక్కరే పైచేయి సాధిస్తారు కదా"
- సచిన్ తెందూల్కర్, దిగ్గజ క్రికెటర్
టీమ్‌ఇండియా తాత్కాలిక సారథి అజింక్య రహానెపై సచిన్ ప్రశంసల వర్షం కురిపించారు. అతడి నాయకత్వం అద్భుతమని కొనియాడారు. "మన జట్టుది అద్భుతమైన ప్రదర్శన. రహానె జట్టును ముందుండి నడిపించిన తీరు చిరస్మరణీయం. సీనియర్ క్రికెటర్లూ ఎంతో గొప్పగా రాణించారు. ఇక దయచేసి విరాట్‌తో అజింక్యను పోల్చొద్దు. వారిద్దరూ టీమ్‌ఇండియాకే ఆడుతున్నారు. దేశంకన్నా వారేమీ ఎక్కువ కాదు. మ్యాచ్‌లో అజింక్య తెలివిగా బ్యాటింగ్ చేశాడు. ప్రశాంతంగా, కుదురుగా ఆడాడు. అతడు దూకుడుగా ఆడినా ప్రశాంతత సమతూకం తీసుకొచ్చింది. చెత్త బంతి దొరికితే అతడు అస్సలు వదల్లేదు. ఎంతో సహనంతో ఆడాడు. అతడి ఉద్దేశం చాలా బాగుంది" అని సచిన్ ప్రశంసించారు.
వారికీ అనుభవం ఉంది
జట్టు సభ్యులు నిరాశపడుతున్న ప్రతిసారీ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తానున్నా అంటూ ముందుకొచ్చాడని సచిన్ అన్నారు. అద్భుతంగా బంతులు విసిరాడని ప్రశంసించారు. శుభ్‌మన్ గిల్ ఆత్మవిశ్వాసంతో సౌకర్యంగా ఆడాడన్నారు. సిరాజ్ తొలి మ్యాచ్ ఆడుతున్నట్టు కనిపించలేదని పేర్కొన్నారు. 6, 7, 8 స్థానాల్లో ఆడిన పంత్, జడేజా, అశ్విన్ సమయోచితంగా పరుగులు చేశారని తెలిపారు. వారందరికీ శతకాలు చేసిన అనుభవం ఉందని గుర్తు చేశారు. మెల్‌బోర్న్‌లో జడేజా, అజింక్య మధ్య భాగస్వామ్యం ఎంతో విలువైందని వెల్లడించారు.
ఇదీ చూడండి: రోహిత్.. చాలా నాజూగ్గా కనిపిస్తున్నావు: శాస్త్రి