ఆస్ట్రేలియా పేసర్ కేన్ రిచర్డ్‌సన్‌కు కరోనా వైరస్ (కొవిడ్-19) నెగిటివ్ అని తేలింది. గొంతులో మంటగా అనిపిస్తోందని చెప్పడం వల్ల ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు (సీఏ) అతడికి కరోనా పరీక్షలు నిర్వహించింది.
" ఈ రోజు నిర్వహించిన పరీక్షలో రిచర్డ్‌సన్‌కు కరోనా వైరస్ నెగిటివ్ అని వచ్చింది. అతడు హోటల్ నుంచి సిడ్నీ వేదికగా ఆసీస్-కివీస్ మధ్య జరుగుతున్న తొలి వన్డేకు వెళ్లడానికి అనుమతి లభించింది"
-- ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు
దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లి వచ్చిన రిచర్డ్‌సన్ గొంతులో మంట ఉందని చెప్పడం వల్ల ఆసీస్ క్రికెట్ బోర్డు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. అతడిని జట్టు నుంచి ప్రత్యేకంగా ఉంచి పరీక్షలు నిర్వహించింది. అంతేకాక కివీస్‌తో తొలి వన్డేకు అతడి స్థానంలో సీన్ అబాట్‌ను ఎంపిక చేసింది. అయితే ఇది సాధారణ గొంతు నొప్పి అని, కానీ ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాల మేరకు అతడికి పరీక్షలు నిర్వహిస్తామని సీఏ ప్రతినిధి అంతకుముందే తెలిపారు. 29 ఏళ్ల రిచర్డ్‌సన్ ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.