టీమ్‌ఇండియా చేతిలో ఆస్ట్రేలియా ఓటమిపాలయ్యాక ఆ జట్టులోని పలువురు ఆటగాళ్లు కోచ్ జస్టిన్ లాంగర్ పట్ల అసంతృప్తితో ఉన్నారన్న వార్తలు వెల్లువెత్తాయి. మొదట అలాంటివేం లేవని కొట్టిపారేసిన ఆస్ట్రేలియా కోచ్ తర్వాత నిజమేనని అంగీకరించాడు. తాజాగా అక్కడి విలేకర్లతో మాట్లాడుతూ అసలేం జరిగిందనే విషయాన్ని సరదాగా వివరించాడు.
"గబ్బా టెస్టులో ఓ రోజు భోజన విరామం తర్వాత మార్నస్ లబుషేన్‌కు టోస్టెడ్ సాండ్‌విచ్‌ను మైదానంలోకి తీసుకెళ్లొద్దని చెప్పడమే ప్రస్తుత పరిస్థితులకు సగం కారణం. దాంతో నేనిప్పుడు ప్రపంచంలోనే చెడ్డ వ్యక్తిగా మిగిలిపోయాను. ఆస్ట్రేలియా జట్టు ప్రమాణాలు దిగజారిపోతున్నాయని భావిస్తే నా కోపాన్ని అదుపుచేసుకోలేను. నాయకత్వం అనేది పాపులారిటీ కాదు. కొన్నిసార్లు కఠిన పరిస్థితులు ఎదుర్కోవాలి.. కొన్నిసార్లు కఠినంగానూ ఉండాలి. అయితే, మనపై వచ్చే విమర్శలనూ చిరునవ్వుతో స్వీకరించి తప్పులు దిద్దుకోవాలి.
అలాగే నాలో ఉన్న ఒక మంచి విషయం ఏంటంటే స్వీయ పరిశీలన చేసుకుంటా. ఎవరైనా నాలో తప్పులు చూపిస్తే వాటిని సరిదిద్దుకుంటా. లేకపోతే ఇక్కడివరకు వచ్చేవాడిని కాదు. నాకొచ్చే సలహాల్లో ప్రయోజనకరమైన వాటిని స్వీకరించి ముందుకు సాగుతా. అయితే, ఇప్పుడు నన్ను బాధించేది ఒకటే విషయం. ఈ అంతర్గత సమస్యలన్నీ ఆటగాళ్ల నుంచి బయటకు రావటమే. నేనెలాంటి వాడినో మీకు తెలుసు. నిజంగానే కొన్నిసార్లు కఠినంగా ఉంటా, కొన్నిసార్లు కోపంగా ఉంటా. నేను మరీ అంత ఉత్తముడిని కాకపోయినా కొన్ని విషయాల్లో చాలా మంచివాడిని. కానీ, జట్టు అంతర్గత విషయాలు ఇతరుల ద్వారా బయటకు రావడమే నచ్చలేదు. దానికంటే ఆటగాళ్లు నేరుగా వచ్చి నాతో మాట్లాడితే బాగుండేది. దీనిపై అందరం కూర్చొని చర్చించుకుంటే సరిపోతుంది" అని అన్నాడు ఆస్ట్రేలియా కోచ్.
ఇదీ చూడండి: వాటిని అసలు విడిచిపెట్టను: జస్టిన్ లాంగర్
ఇదీ చూడండి: ఆస్ట్రేలియా జట్టులో విభేదాలు.. లాంగరే కారణం?