ఫ్లడ్‌లైట్ల వెలుతురులో గులాబీ బంతిని ఎదుర్కొవడం అంత సులభమేమి కాదని ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైన్ అన్నాడు. టీమ్ఇండియాతో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో ఆసీస్ జట్టులో టాప్ స్కోరర్ పైన్(73). భారత్ బౌలర్లు చెలరేగడం వల్ల ఆతిథ్య జట్టు 191 పరుగులకే ఆలౌటైంది.
"డే/నైట్ టెస్టులో ఫాస్ట్ బౌలింగ్‌తో పాటు గులాబి బంతి కీలకమైనది. ఈ మ్యాచ్‌ల్లో బ్యాట్స్‌మెన్ కుదురుకోవడానికి సమయం పడుతుంది. ఆ బంతిని ఎదుర్కోవడం అంత సులభం కాదు" అని రెండో రోజు మ్యాచ్ అనంతరం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పైన్ చెప్పాడు.
టీమ్ఇండియా అద్భుతంగా బౌలింగ్ చేసి, తమను ఒత్తిడిలో నెట్టారని పైన్ అన్నాడు. అయితే తర్వతి ఇన్నింగ్స్‌లో దీనిని అధిగమిస్తామని ధీమా వ్యక్తం చేశాడు.
రెండో రోజు 233/6తో మ్యాచ్ మొదలుపెట్టిన భారత్.. 244 పరుగులకు తొలి ఇన్నింగ్స్ ముగించింది. అనంతరం బ్యాటింగ్ చేసిన ఆసీస్ 191 పరుగులకే ఆలౌటైంది. అశ్విన్(4/55), ఉమేశ్ యాదవ్ (3/40), బుమ్రా (2/52) ఆకట్టుకున్నారు. రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లీసేన 9/1తో ప్రస్తుతం నిలిచింది. క్రీజులో మయాంక్ అగర్వాల్, బుమ్రా ఉన్నారు.