ప్రపంచ క్రికెట్లో టీమ్ఇండియా అత్యుత్తమ స్థానంలో నిలవనుందని, విదేశాల్లో మ్యాచ్‌ల గెలిచే సరికొత్త అధ్యాయాన్ని సృష్టించనుందని దిగ్గజ క్రికెటర్ ఇయాన్ చాపెల్ అభిప్రాయపడ్డాడు. జట్టులో ప్రతిభావంతులు, విజయాలే ఇందుకు కారణమని పేర్కొన్నాడు.
"ఇటీవల ఆస్ట్రేలియాలో ఆసీస్‌పై గెలవడం భారత ఆటగాళ్లలోని సామర్ధ్యాన్ని వెలికి తీసింది. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే విజయం సాధించగలమనే నమ్మకాన్ని పెంచింది. జట్లన్నీ విదేశాల్లో ఇబ్బంది పడుతుంటే టీమ్ఇండియా మాత్రం ఆ విధానాన్ని తిరగరాసేందుకు సిద్ధమవుతోంది. గతంలో వెస్టిండీస్, ఆస్ట్రేలియా జట్లలా ఇప్పుడు భారత్ ఆధిక్యం ప్రదర్శించే అవకాశముంది" అని ఇయాన్ చాపెల్ తెలిపాడు.
టీమ్ఇండియాలోకి యువ క్రికెటర్లు వస్తుండటం, ఇటీవల జరిగిన మ్యాచ్ విజయాల్లో వారు భాగం కావడంపై చాపెల్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. శుభమన్ గిల్, సిరాజ్, సైనీ, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, నటరాజన్ లాంటి వాళ్లు కేవలం మూడు నెలల్లో జట్టులో తమ వంత పాత్ర పోషిస్తున్నారని అన్నాడు.
గంగూలీ హయాంలో ప్రతి క్రికెటర్, ప్రత్యర్థులకు తామేం తక్కువ కాదని భావించేలా ఉండేవారని చాపెల్ చెప్పాడు. ఆ నమ్మకం ధోనీ, కోహ్లీ కెప్టెన్సీలో ఇంకా పెరిగిందని అన్నాడు.